మొత్తానికి తన వరుస సోలో హీరో పరాజయాలకు చెక్ చెబూతూ ఒరిజినల్ 'ప్రేమమ్' కంటే బాగుందనే టాక్‌ను సొంతం చేసుకున్న 'ప్రేమమ్' చిత్రం అక్కినేని అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దసరా కానుకగా అక్టోబర్7న విడుదలైన నాగచైతన్య 'ప్రేమమ్' చిత్రం మల్టీప్లెక్స్, 'ఎ' సెంటర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బి,సి సెంటర్లలో సైతం ఈ చిత్రానికి ఊహించిన దాని కంటే మంచి స్పందనే వచ్చింది. ఈ చిత్రం సోలో హీరోగా నాగచైతన్యకు తీపి చిత్రంగా మిగిలింది. కాగా ఈ చిత్రం కంటే ముందే క్రియేటివ్ జీనియస్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' అనే చిత్రంలో నటించాడు. కానీ తమిళ వెర్షన్‌కు కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురుకావడంతో శింబు హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలలో చాలా జాప్యం జరిగింది. తనకు మొదటి హిట్‌ను ఇచ్చిన గౌతమ్‌మీనన్ 'ఏ మాయ చేశావే' తరహాలోనే ఈ చిత్రం కూడా తన టీజర్, పోస్టర్స్ ద్వారా మంచి స్పందనను సాధించి నాగచైతన్య అభిమానులను అతి త్వరలోనే అలరించేందుకు రంగం సిద్దం చేసుకుంది. తెలుగులో 'ఏమాయచేశావే' తరహాలోనే నాగచైతన్య, మంజిమామోహన్ జంటగా ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతంతో భారీ ఆశలు నెలకొల్పింది. ఇక ఈ చిత్రం తమిళంలో శింబు హీరోగా, అదే మంజిమామోహన్ హీరోయిన్‌గా రూపొందింది. ఈ చిత్రం నవంబర్ 11న తెలుగు,తమిళ్ భాషల్లో ఒకే రోజున భారీ స్దాయిలో విడుదలకు సిద్దమైంది. జస్ట్ ఒక నెల ముందే 'ప్రేమమ్'తో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం వచ్చిన అతి తక్కువ వ్యవధిలోనే 'ఏ మాయ చేశావే' చిత్రం తరహాలో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కూడా నాగచైతన్యకు సోలో హీరోగా మరీ ముఖ్యంగా ఆయన కోరుకుంటున్న మాస్ ఇమేజ్‌ను తీసుకొని వస్తుందని ఆయన అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.