మలయాళంలో మోహన్‌లాల్ సూపర్‌స్టార్. ముమ్మట్టితో పోటీ పడుతూనే ఆయన మలయాళంలో దశాబ్దాలుగా ఏలుతున్నాడు. కాగా ఆయన తన కెరీర్‌లో ఒకానొక సమయంలో 'యోధ' తో పాటు మరికొన్ని డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. కానీ ఆయన ఎందువల్లనో గానీ టాలీవుడ్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ విషయంలో ఆయన రజనీ, కమల్, మమ్ముట్టి వంటి వారికంటే వెనుకపడ్డాడు. అయినా లేట్‌గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్లు ఆయన ఈ వయసులో టాలీవుడ్‌పై దృష్టిసారించాడు. ఇటీవలే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో 'మనమంతా' అనే అద్భుత చిత్రం చేశాడు. విమర్శకులు ప్రశంసలు పొందిన ఈ చిత్రం కమర్షియల్‌గా మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. ఇక ఆయన కీలకపాత్రలో టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించిన 'జనతాగ్యారేజ్' చిత్రం మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి తన సత్తా చాటింది. ప్రస్తుతం మోహన్‌లాల్ మలయాళంలో నటించిన కొన్ని పాత చిత్రాలను సైతం ఇప్పుడు కొంతమంది చిన్న నిర్మాతలు తెలుగులోకి అనువదించే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆందరిచూపు మలయాళంలో ఆయన నటించిన 'ఒప్పం, పులిమురుగన్' చిత్రాలపై పడింది. ఈ రెండు చిత్రాలు మలయాళంలో ఘనవిజయం సాధించి ఇతర భాషా నటీనటులు, దర్శకనిర్మాతలను ఆకట్టుకుంటున్నాయి. ఇక 'ఒప్పం' చిత్రాన్ని పక్కనపెడితే ఆయన నటించిన 'పులిమురుగన్' చిత్రం మలయాళంలో దసరా కానుకగా విడుదలై 'బాహుబలి' తర్వాత ఆ స్దాయి చిత్రం గా అని పేరు తెచ్చుకుంది. మలయాళంలో 100కోట్లు సాధించిన ఒకే ఒక్క చిత్రంగా ఈ చిత్రం రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రంలో మన నటుడు జగపతిబాబు విలన్‌గా నటించాడు. కాగా ఈ చిత్రాన్ని ప్రస్తుతం 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి తెలుగులోకి 'మన్యం పులి' పేరుతో అనువాదం చేస్తున్నాడు. మరి ఈ డబ్బింగ్ చిత్రం తెలుగులో ఎలాంటి విజయాలను సాధిస్తుందో వేచిచూడాల్సివుంది.