చాలా కాలం నుండి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పుకార్లు నిజమనిపించేలా అధికార్లు ఆమె ఆరోగ్యంపై వ్యవహరిస్తున్న తీరు అర్థమౌతుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న అమ్మ ఇటీవల కాస్త కోలుకుంటోందని తమిళనాడు ఆసుపత్రి లోని అపోలో ఆసుపత్రి వైద్యాథికారులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో నిజమెంత అనే విషయం తెలియడం లేదు. ఈ సందర్భంలో మరో వార్త తమిళనాడు ప్రజలను, పార్టీ వర్గాలను కలవరానికి గురిచేస్తుంది. త్వరలోనే జయలలిత కోలుకుంటోందని భావించిన అన్నాడీఎంకే వర్గానికి ఇది చాలా దుమారానికి దారి తీసే వార్తే అని చెప్పక తప్పదు. తమిళనాడులోని మధుర జిల్లా తిరుపారంగుండ్రం అసెంబ్లీ స్థానానికి నవంబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. అధికార ఏఐడీఎంకే తరఫున ఏకే బోస్ అనే అభ్యర్థి పోటీ చేయనున్నాడు. అయితే పార్టీ తరపున ఆయన పోటీ చేయడానికి పార్టీ అధినేత్రి అనుమతి తప్పని సరి. అయితే ఆమె సంతకం చేసే పరిస్థితులో కూడా లేకపోవడంతో వైద్యులు ఆమె వేలి ముద్రలు తీసుకున్నారు. ఇదే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రెకియోటెమి విధానంలో జయలలిత కుడిచేతి గుండా కృత్రిమ నాళాలను వేసినందువల్లే ఆమె సంతకం చేయలేకపోయారని, అందుకే ఎడమచేతి వేలిముద్రలు తీసుకున్నామని అధికారులు ఎలక్షన్ కమిషన్ కు తెలిపారు. కానీ అసలు ఆసుపత్రిలో నిజంగా ఏం జరుగుతుందో తెలియక అభిమానులు కలవరానికి గురౌతున్నారు.