నెల్లూరు జిల్లాలో తెదేపా, వైకాపాల మధ్య వర్గ విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నెల్లూరు జిల్లాలోని కార్పోరేషన్ కౌన్సిల్ లో జరిగిన సమావేశం రసాభాసాగా మారింది. అయితే మొదట పలు విషయాలపై సభ సజావుగానే సాగినా ఆ తర్వాత మధ్యలో వార్డుల ఆక్రమణల అంశంపై చర్చ రసాభాసకు దారితీసింది. దీంతో ఉన్నపలంగా ఇరు పార్టీ వ్యక్తుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన ఈ భేటీలో టీడీపీ సభ్యుడిని వైకాపా కార్పొరేటర్ కొట్టినట్లుగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఆక్రమణల తొలగింపుకు సంబంధించిన వైసీసీ సభ్యులు గట్టిగా నినదిస్తూ బల్లలు చరిచారు. వారి తీరుపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గొడవ స్టార్ట్ అయింది. అదే సమయంలో వైసీపీ కార్పొరేటర్ దేవరకొండ అశోక్, టీడీపీ కార్పొరేటర్ యాకసిరి ప్రశాంత్‌కిరణ్ వద్దకు వెళ్లి ముఖంపై గట్టిగా పిడిగుద్దులు గుద్దాడు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన మేయర్ అబ్దుల్ అజీజ్, వైసీపీ సభ్యుడు అశోక్ ను సస్పెండ్ చేశాడు. సభలో దౌర్జన్యానికి పాల్పడిన విషయమై పాలకవర్గం నుంచి తొలగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతున్నట్లు మేయర్ చెప్పాడు. అయితే ఈ సమావేశం ఆద్యంతం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య కొనసాగడం విశేషం.