నరేష్ కెరీర్ మొదట్లో తాను చేసినవన్నీ సాధారణ, రొటీన్ తరహా చిత్రాలైనప్పటికీ దర్శకుల ప్రతిభ వల్ల ఆయా చిత్రాలు హిట్ అయ్యాయి. మద్యలో 'నేను, ప్రాణం' వంటి విభిన్న చిత్రాలు చేసినప్పటికీ ప్రేక్షకులను అల్లరినరేష్ అలాంటి పాత్రల్లో మెప్పించలేకపోయాడు. ఇటీవల వచ్చిన 'లడ్డూబాబు' చిత్రం ఫీల్‌గుడ్ ఫిలింగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో నరేష్ మరలా రొటీన్ చిత్రాల మీద మనసు పారేసుకున్నాడు. అయినా అతనికి ప్రేక్షకులు ఆ అవకాశాన్ని ఇవ్వడం లేదు. దీంతో ప్రస్తుతం నరేష్ తన జోనర్ అయిన కామెడీ, స్పూఫ్ లను వదిలిపెట్టి హర్రర్ థ్రిల్లర్, కామెడీ టచ్ చేస్తూ సాగే 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' చిత్రం చేస్తున్నాడు. త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రానికి దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి, నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్‌లపైనే నమ్మకం. నాగేశ్వర్‌రెడ్డి తన కిందటి నరేష్ చిత్రాలను హిట్ చేసిన డైరెక్టర్‌గా పేరుతెచ్చుకోవడం, 'అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో' వంటి భారీ చిత్రాలను నిర్మించిన ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత కావడం కూడా దీనికి ఒక కారణం. కాగా తనకంటూ మరో భిన్నమైన చిత్రాన్ని 'అల్లరి' రవిబాబు దర్శకత్వంలో త్వరలో నరేష్ నటించనున్నట్లు సమాచారం. తన మొదటి చిత్రాన్నే తమ ఇంటి పేరుగా మార్చుకున్న నరేష్, రవిబాబులు కలిసి చేసే చిత్రమైనా 'లడ్డూబాబు'లా కాకుండా డిఫరెంట్ జోనర్‌లో తనకు బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో నరేష్ వున్నాడు.