తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన కేంద్రం ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ పుష్కలంగా నిధులిస్తామంటూ ప్రకటిస్తుంది. కానీ మాటలకే గానీ చేతల్లో కేంద్రప్రభుత్వం ఏమాత్రం చూపడం లేదన్నది తెలుస్తున్న విషయం. చంద్రబాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమరావతి కేంద్రంగా నూతన రాజధానిని నిర్మించాలన్న గట్టి కాదుగానీ, మొండి పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ కేంద్రం చేస్తున్న, నిధులపై కేంద్రం చూపుతున్న వైఖరి పట్లనే అనుమానంగా ఉంది. నిధులు, ప్రత్యేక ప్యాకేజీలు అని కేంద్రం అంటూనే ఉంది గానీ అది ఆచరణాత్మకంగా ఇవ్వడం జరగడం లేదని వెల్లడౌతుంది.
అసలు లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కిందా మీదా పడుతూ తాత్కాలిక భవనాలంటూ ఏర్పాటు చేసుకుంటుంది. అలా ఏర్పాటు చేయాలని భావించిన ఏపీ ప్రభుత్వ భవన సముదాయానికి కేంద్రమంత్రులు వచ్చి శంఖుస్థాపనలు చేసి, చేతులు దులుపుకొని వెళ్తున్నారు గానీ, అందుకు అయిన ఖర్చు కూడా కనీసం ఇవ్వడానికి మొగ్గుచూపడం లేదు కేంద్రప్రభుత్వం. అంతే కాకుండా ఏపీలో ఏ చిన్న పథకం అమలు చేయాలన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులను బట్టి బాబు కేంద్రం వైపు చూడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం కలిగిన బాబు నుంచి ప్రజలు కూడా ఎంతో ఆశిస్తున్నారు. అలాంటిది బాబు గడచిన రెండు సంవత్సరాలుగా కేవలం శంకుస్థాపనలు తప్ప పని ఏమాత్రం జరగలేదన్నది ప్రత్యక్షంగా తెలుస్తున్న అంశం.
అధికారంలోకి వచ్చిన బాబు రెండున్నర సంవత్సరాలుగా కేవలం రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకు స్థాపనలు మాత్రమే చేసి కూర్చున్న విషయం కూడా తెలిసిందే. అందుకోసం ఎంతో ఆర్భాటంగా జరిపిన శంఖుస్థాపనలకే చంద్రబాబు విపరీతంగా ఖర్చు చేశాడు. నిర్మాణానికే నిధులు లేకపోతే శంకుస్థాపనలకు ఇంత ఖర్చు చేయడం అవసరమా అంటూ అప్పట్లో విమర్శలను కూడా బాబు చవి చూశాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఇప్పుడు మరో శంకుస్థాపన అంటూ సిద్ధమయ్యాడు. అమరావతిలో ప్రభుత్వం భవనాల సముదాయానికి నేడు శంకుస్థాపన జరపబోతున్నాడు. దీనికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా చాలా లోటుబడ్జెట్ లో ఉందని ఎన్నిసార్లు మొత్తుకున్నా, ప్రత్యేక హోదా కోసం ఎంత ఉద్యమించినా అందుకు ఏమాత్రం స్పందించని కేంద్రం నిధుల విషయంలో నిధులను ఇంకా ఎంగిలి మెతుకులనే రాల్చుతుందని చెప్పాలి. ఇలా కేంద్రం విదిల్చే నిధులు చంద్రబాబు చేసే శంకుస్థాపన ఖర్చులకు కూడా రావడం లేదన్న విమర్శలను బాబు ఎదుర్కొంటున్నాడు. ఈ విధంగా కేంద్రం విదిల్చే నిధులతో ఇప్పట్లో రాజధాని నిర్మాణం కనీసం ముందుకు పోయే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదన్నది వెల్లడౌతున్న అంశం. ఇలాంటి సందర్భంలో కనీసం ఆంధ్రప్రదేశ్ కు మోడి ప్రభుత్వం శంఖుస్థాపన ఖర్చులన్నా ఇస్తుందా? లేకా అసలకే ఎసరు పెడుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.