కొందరు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు తాజాగా మంచి విజయాలు అందుకొన్నప్పటికీ తమ తదుపరి చిత్రాలను లైన్‌లో పెట్టడానికి భారీ గ్యాప్ తీసుకుంటున్నారు. సుకుమార్ విషయానికి వస్తే ఆయన తీసిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలై ఏడాది కావస్తున్నా కూడా ఆయన తన తదుపరి చిత్రం ఇంకా మొదలుపెట్టలేదు. ఆయన తన తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తో చిత్రం చేయాల్సివుంది. ప్రస్తుతం 'ధృవ' చిత్రంతో బిజీగా ఉన్న చరణ్ డిసెంబర్‌కు గానీ ఫ్రీ అవ్వడు. అంటే సుక్కు తదుపరి చిత్రం కోసం మరో రెండు నెలలు ఆగాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇక వంశీపైడిపల్లికి కూడా అదే దారి. ఆయన తీసిన 'ఊపిరి' చిత్రం ఘనవిజయం సాధించినప్పటికీ తన తదుపరి చిత్రానికి భారీ గ్యాప్ తప్పడం లేదు. మధ్యలో అఖిల్‌తో ఓ చిత్రం అని ప్రచారం సాగింది. కానీ అది విక్రమ్ కె.కుమార్ తన్నుకుపోయాడు. ఇక వంశీకి మహేష్‌బాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కానీ ప్రస్తుతం మహేష్, మురుగదాస్, ఆ తర్వాత కొరటాల శివతో చిత్రాలు చేయనున్నాడు. ఈ రెండు పూర్తి చేసి వంశీపైడిపల్లి దగ్గరకు వచ్చేసరికి మరో ఏడాది పట్టేట్లు కనిపిస్తోంది. బోయపాటి శ్రీను 'సరైనోడు' వంటి బ్లాక్‌బస్టర్ అందించి, తన తదుపరి చిత్రాన్ని బెల్లకొండ సాయిశ్రీనివాస్‌తో చేయాలనుకున్నాడు. కానీ ఈ చిత్రం ఆర్దిక కారణాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరి బోయపాటి తన తదుపరి చిత్రం కోసం అంటే మెగాస్టార్ చిత్రం అవకాశం కోసం ఎదురుచూస్తూ గడపాల్సిన పరిస్దితి ఏర్పడేలా ఉంది. మొత్తానికి ఈ ముగ్గురు డైరెక్టర్లు బిజీగా మారడానికి మాత్రం ఇంకా సమయం పట్టేట్లు ఉంది.