సుపరిపాలనా సౌలభ్యం కోసం అంటూ 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ మొత్తానికి 31 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఏపీలో కూడా అలాగే విభజించాలని, అలా విభజించి పాలించే ధైర్యం బాబుకి లేదని, అసలే ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న ఏపీ మళ్ళీ జిల్లాల విభజన తలకు మించిన భారం అవుతుందని చర్చోపచర్చలు జరిగాయి. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో మొత్తం 60 మినీ జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా సుపరిపాలన జరపాలని ఆలోచిస్తున్నాడు. అయితే జిల్లాల విషయంలో బాబు ఎత్తుగడ ఏంటంటే.. డైరెక్టుగా జిల్లాలను విభజించకుండా భౌగోళికంగా పాలన వికేంద్రీకరణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ను 60 మినీ జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. ఇక్కడ రెవెన్యూ శాఖ అధీనంలో రెవెెన్యూ డివిజన్ల పరిదిలో అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేసే దిశగా బాబు ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్డీవోలకు పెద్ద పనే రాబోతున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి దాదాపు కలెక్టర్ వలెనే ఇక ఆర్డీవోలు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల పనితీరును ప్రత్యేక చొరవతో నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మొత్తానికి ఏపీలో 60 రెవిన్యూ డివిజన్లు రాబోతున్నాయన్నమాట.