ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధినేత జగన్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ప్రజల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వీరిద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర పోటీ నెలకొందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంపై ఇరువురి ఉద్యమం కొనసాగుతుంది. ఒక్క ప్రత్యేక హోదా అంశమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడ ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులు పరిగెత్తుతున్న విషయాన్ని చూస్తునే ఉన్నాం. ఓ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తీరిక లేకుండా సినిమాలు చేసుకుంటూ కథా నాయకుడుతో పాటు ప్రజల బాధను తన బాధలుగా చేసుకొని ప్రజానాయకుడు కావాలని కోరిక. అలా జనసేన పార్టీని స్థాపించి అంచలంచలుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ, అప్పుడప్పుడూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రత్యేక హోదాకోసమని రెండు భారీ బహిరంగ సభలను తిరుపతి, కాకినాడలలో ఏర్పాటు చేశాడు. అలాగే గోదావరి జిల్లా నుండి ఆక్వా ఫుడ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమ బాధలను చెప్పుకున్న రైతులకు పవన్ కళ్యాణ్ తాను అండగా నిలుస్తానంటూ ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైకాపాను స్థాపించి ఓదార్పు యాత్ర నుండి మొదలుకొని ప్రతి చిన్న విషయం పట్ల ప్రజల్లో నిరంతరం తిరుగుతూ దీక్షలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో జరిగిన సాధారణ ఎన్నికలు, ఆ తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలను గమనిస్తే పవన్,జగన్ లను గురించి వారు ప్రజల్లో ప్రజల కోసం చేస్తున్న పోరాటం గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు వీరిద్దరూ కలిసి అధికారంలో ఉన్న తెదేపాను టార్గెట్ చేస్తున్నారా? లేకా వీరిద్దరూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారా? అన్నది ఇంకా అర్ధం కాని విషయంగానే నడుస్తున్న చరిత్రను గమనిస్తే తెలుస్తున్న అంశం. జగన్ మాత్రం నిరంతరం అధికార పార్టీపైనే దుమ్మెత్తి పోస్తూ తెదేపా లక్ష్యంగా ప్రజల్లో తన బాణాలను గురిపెడుతున్న విషయం తెలిసిందే. అయితే పవన్ మాత్రం ఇప్పుడు ఎటు ఉన్నారు?, రేపు ఎలా ఉండబోతున్నారు? అతని స్టాండ్ ఏంటి? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సిన అంశం. ఎన్నికల సమయంలో జగన్ లక్ష్యంగా ప్రచారం చేసిన పవన్ ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిని ఏ మాత్రం పట్టించుకోలేదనే చెప్పాలి. కానీ పవన్ దృష్టి మాత్రం నిరంతరం జగన్ వైపు చూస్తుందన్నది చాలా జాగ్రత్తగా ఏపీ రాజకీయాలను గమనిస్తే తెలుస్తున్న అంశం. అప్పుడప్పుడూ ఏపీ ప్రజలను సంతృప్తిపరచడం కోసం సభలు సమావేశాలు నిర్వహించి అధికార పార్టీని అడుగుతా సమస్యలను పరిష్కరిస్తానంటాడే గానీ, పవన్ ఆ తర్వాత ఆయా అంశాలపై సీరియస్ గా పోరాడిన దాఖలాలు లేవనే చెప్పాలి. జగన్ ఎప్పుడు ఏ జిల్లాలో పర్యటించి ఎంత మైలేజ్ ని సొమ్ము చేసుకుంటున్నాడు, ఆయా జిల్లాలను తాను ఎప్పుడు తిరిగి ప్రజలను ఆకట్టుకోవాలి అనే విషయంపైనే పవన్ కళ్యాణ్ దృష్టి కేంద్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతే జాగ్రత్తగా జగన్ కూడా పవన్ ఏదైనా చేద్దామంటే చాలు అది వెంటనే జగన్ చేసి చూపుతున్న ఘటనలు కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక నిన్న జగన్ జై ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రత్యేక హోదాపై ఉద్యమించే నిమిత్తం భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తానని ప్రకటించగా వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం అనంతపురంలో నవంబర్ 10వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నాడని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా పవన్ లక్ష్యంగా జగన్ గురిపెడుతున్నాడా?. లేకా జగన్ లక్ష్యంగా పవన్ గురిపెడుతున్నాడా?. లేకపోతే వీరిద్దరి లక్ష్యం అధికారమేనా?. అలా కాకుండా వీరిద్దరి లక్ష్యం చంద్రబాబా?. అసలు గత సాధారణ ఎన్నికల్లో బాబు తరఫున ప్రచారం చేసిన పవన్, ఈ సారి కూడా అలాగే చేయనున్నాడా? లేకా ప్రత్యేకంగా తమ పార్టీ తరఫున పోటీ చేయనున్నాాడా?. అసలు ఇక్కడ జరుగుతున్న విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తున్న అంశం ఏంటంటే.. చంద్రబాబే.. జగన్ ను ప్రజల్లో నిలువరించేందుకోసం పవన్ ను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తున్నాడా? అనేవి అంతుపట్టని ప్రశ్నలుగానే ఉన్నాయి. కానీ వాస్తవంగా జరుగుతున్నది మాత్రం అధికారం కోసం అందరూ ఎవరి కృషి వారు చేస్తున్నారని తెలుస్తుంది.