ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ మంత్రులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయన మంత్రుల పనితీరుపై సంబంధించి ఎప్పుడంటే అప్పుడు మంత్రులతో భేటీ అయ్యి చర్చిస్తున్నారు. వారి పని తీరు మెరుగుపరుచుకోమని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇక మంత్రులకి సంబంధించి వారి పనితీరుపై సీక్రెట్ సర్వేలు కూడా బాబు చేపిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయనకు కుడి భుజం గా యనమల రామకృష్ణుడు ఉంటాడు. గతం లో కూడా యనమలకు బాబు ఆర్ధికశాఖ ని ఇచ్చి మంత్రి వర్గం లో ప్రముఖంగా చూసేవాడు.
ఇప్పుడు కూడా ఏపీకి ఆర్ధిక మంత్రిగా యనమలను నియమించిన చంద్రబాబు కొన్నాళ్ళు ఆయనకు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. అయితే గత కొంత కాలంగా యనమల అసలు మీడియాలో గాని బాబు నోటి మాటల్లో గాని ఎక్కడా వినబడడం లేదు.. అంటే బాబు దృష్టిలో యనమలకు ప్రాధాన్యత తగ్గినట్లేగా...! అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. అందుకే యనమల పెద్దగా ఎవరికీ కనబడడం లేదని అంటున్నారు. అయితే ఇదంతా యనమల స్వయంకృతాపరాధంగా చెబుతున్నారు టిడిపి నేతలు. యనమల తన నియోజక వర్గమైన తుని ని అసలు పెద్దగా అభివృద్ధి చేయకపోవడమే బాబు దృష్టిలో అయన ప్రాధాన్యత తగ్గడానికి కారణమని అంటున్నారు. యనమల తన కుటుంబ సభ్యులతో కలిసి అవినీతిని ప్రోత్సహిస్తున్నాడని అందుకే బాబు యనమలను దూరం పెట్టేసాడని వార్తలొస్తున్నాయి. దీనివల్లే యనమల ప్రాధాన్యత టిడిపిలో తగ్గుతుందని... అందుకే బాబు కూడా తన కేబినెట్ లో యనమలకు డి గ్రేడ్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది.
అయితే మరోపక్క యనమలకు టిడిపిలో ప్రాధాన్యత తగ్గడానికి కారణం వేరే ఉందని అంటున్నారు. అదేమిటంటే చంద్రబాబు కొడుకు లోకేష్ కి యనమలకు పెద్దగా పడడం లేదని వీరికి అభిప్రాయం భేదాలు వచ్చాయని అందుకే యనమల పని టిడిపిలో అయిపోయిందని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి కొడుకుతో పెట్టుకుంటే ఎంతటి సీనియర్ మంత్రి అయినా మరుగున పడిపోవాల్సిందే. కేవలం లోకేష్ వల్లే యనమలను బాబు దూరం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.