టాలీవుడ్ ను చరిత్ర పుటల్లోకెక్కించి ప్రపంచానికి శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేసింది బాహుబలి చిత్రం. అందులో సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ రేంజ్ ని దశదిశలా వ్యాపింపజేసింది బాహుబలి చిత్రం. టాలీవుడ్ చిత్రాలకు వసూళ్ళ స్థాయిని కూడా భారీ స్థాయిలో పెంచింది బాహుబలి చిత్రమే. ఒకేసారి బాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలబడి రాబడిని ఏకమొత్తంగా రూ.600 కోట్ల మైలు రాయికి చేర్చిందీ చిత్రం. అయితే తాజాగా బాహుబలి2పై అందరికీ ఆసక్తి నెలకొంది. బాహుబలి అంత రాబడితే బాహుబలి2 ఇంకెంత బిజినెస్ చేస్తుందన్న విషయంపై టాక్ నడుస్తుంది. కాగా బాహుబలితో పోల్చుకుంటే బాహుబలి2 బిజినెస్ నలభైశాతం ఎక్కువే ఉంటుందని రాజమౌళి ప్రకటించేశాడు కూడాను. అయితే తాజాగా రానా మాట్లాడుతూ... బాహుబలి 2 ఎంతలో ఎంతలేదన్నా రూ.600 కోట్ల బిజినెస్ చేస్తుందని ఆయన వివరించాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా రానా మాట్లాడుతూ.. బాహుబలి వసూళ్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బాహుబలి మొదటి భాగం ఆరు వందల కోట్లు వసూళ్ళు సాధించింది. అయితే రెండో భాగం కూడా అంతే కాకుండా అంతకంటే ఎక్కువే వసూళ్ళ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా రానా మాట్లాడుతూ.. బాహుబలి ఓ మ్యాజిక్. బాహుబలికి వచ్చిన హైప్ చెప్పటానికి సాధ్యం కాదు. సినిమాలు ఇక చూడకూడదని ఇంట్లో కూర్చున్న వాళ్లు కూడా బాహుబలి సినిమాను థియేటర్ కు వెళ్ళి చూశారని ఆయన తెలిపాడు.
అసలు బాలీవుడ్ లో తెలుగు సినిమాకి రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టగలగటం బాహుబలితోనే ప్రారంభమైందనే చెప్పాలి. కాగా రాజమౌళి బాహుబలి2 తో కూడా తగిన విధంగా బిజినెస్ చేసేందుకు, అంతకు మించి ఎఫర్ట్ పెట్టేందుకు తీవ్రంగానే కృషి చేస్తున్నట్లు వెల్లడించాడు రానా. మొత్తానికి రానా ఇప్పటినుంచే బాహుబలి2 బిజినెస్ లెక్కల్లో పడ్డాడన్న మాట.