హాస్యనటుడిగా సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన బ్రహ్మానందం (60) ఇప్పుడు కొత్త క్యారెక్టర్ పోషించనున్నారట. దర్శకుడిగా మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. నటుడిగా బ్రేక్ పడడం, ఇంటికే పరిమితమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే హాస్యనటులు దర్శకులుగా మెగా ఫోన్ పట్టడం అనేది కొత్తకాదు. గతంలో కూడా స్టార్ కమేడియన్స్ దర్శకత్వం వహించిన సందర్భాలున్నాయి. తెలుగులో తొలి స్టార్ కమేడియన్ కస్తూరి శివరావు తొలుత నిర్మాతగా, ఆ తర్వాత దర్శకుడిగా మారారు. స్వీయ దర్శకత్వంలో 'పరమానంద శిష్యులు' (1950)లో తీశారు. కమేడియన్ పద్మనాభం నిర్మాతగా అనేక సినిమాలు తీశారు. గాయకుడు బాలుని ఆయనే పరిచయం చేశారు. దర్శకుడిగా 'శ్రీరామకథ' (1969), 'కథానాయిక మొల్ల' (1970), 'పెళ్ళికాని తండ్రి' (1974) సినిమాలు తీశారు. తమిళ, తెలుగు హాస్యనటుడు నగేష్ కూడా దర్శకత్వం వహించారు. డి.రామానాయుడు నిర్మించిన 'మెురటోడు' (1977) చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. కాబట్టి మన బ్రహ్మానందం దర్శకత్వం వహించడం ఆశ్చర్యం ఏమీ అనిపించదు. చాలా మంది కమేడియన్స్ నిర్మాతలుగా ఎన్నో సినిమాలు తీశారు. బ్రహ్మానందం మాత్రం సినిమా నిర్మించే ప్రయత్నం చేయలేదు. ఆయన దర్శకత్వం వహించే సినిమాకి సైతం నిర్మాతని వెతుక్కుంటున్నారు.