నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి రావడానికి వేగంగా ముస్తాబవుతోంది. ఇది బాలయ్య వందవ సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపైనే నిలిచింది. 'శాతకర్ణి' సినిమా కోసం ఎంపికచేసుకున్న కథ చారిత్రాత్మకమైనది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయమున్న శాతవాహనుని కథ. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ట్రేడ్ లో లేదా? ఈ అనుమానం చాలామందిలో ఉంది. ఎందుకంటే 'శాతకర్ణి' బడ్జెట్ ఎంతో తెలియదు కానీ బిజినెస్ రేంజ్ మాత్రం రూ. 60 కోట్లు దాటే అవకాశం లేదని స్పష్టమైంది. నేడున్న పరిస్థితుల్లో 60 కోట్లు అంటే తక్కువే అయినప్పటికీ బాలకృష్ణ గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఎక్కువే అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు నైజాం,సీడెడ్, కృష్ణ , నెల్లూరు జిల్లాలతో పాటుగా శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ చేశారు. వైజాగ్, గుంటూరు ప్రాంతాలకి, ఇతర భాషల్లో అనువాద హక్కుల బిజినెస్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ దాదాపు 48 కోట్లు అని తేలింది. బ్యాలెన్స్ ఏరియాలు కలిపితే రూ.60 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అంతకంటే తక్కువే జరిగినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ సమాచారం.