బాహుబలి మొదటి భాగం దేశవ్యాప్తం గా ఎంత సంచలనమో అందరికి తెలిసిందే. రాజమౌళి ఒక రేంజ్ లో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసాడు. బాహుబలి 1 తో ప్రభాస్ తో సహా ఈ సినిమాలో నటించిన నటీనటులు మంచి గుర్తింపు పొందారు. బాహుబలి పార్ట్ 1 సినిమా ఎన్ని సంచలనాలకు నెలవైందో..... ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కూడా విడుదలకు ముందే సంచలనాలని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా 2017 ఏప్రిల్ 28 న విడుదల తేదీ ప్రకటించేశారు. అయితే ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న బాహుబలి 2 ఇప్పుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రేపు(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ గా బాహుబలి టీమ్ ఈ ఫస్ట్ లుక్ ని ఒక రోజు ముందే ప్రభాస్ అభిమానుల కోసం విడుదల చేసింది. ఈ బాహుబలి ఫస్ట్ లుక్ ని రాజమౌళి అండ్ టీమ్ ముంబై లో విడుదల చేశారు. ఈ విడుదల కార్యక్రమం లో రాజమౌళితో పాటు ప్రభాస్, అనుష్క, తమన్నా లు పాల్గొన్నారు.
బాహుబలి పార్ట్ వన్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ని ఒక రేంజ్ లో చూపించిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 లో ప్రభాస్ ని ఒక చేతిలో కత్తిని పట్టించి మరో చేతిలో ఇనుప గొలుసులతో ప్రభాస్ ని అబ్బో అనిపించే రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ లుక్ లో ప్రభాస్ ని 8 ప్యాక్ లో చూపించాడు, ఇంకా బ్యాగ్రౌండ్ లో అమరేంద్ర బాహుబలిని చూపించిన రాజమౌళి..... ప్రభాస్ కోపాన్ని, కసిని అతని కళ్లలో చూపించాడు. ఈ విధం గా ప్రభాస్ ని చూసిన వాళ్లకి బాహుబలిలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో వుంటాయో అని అప్పుడే చర్చించుకోవడం మొదలెట్టేసారు. ఈ లుక్ కి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని వచ్చే జనవరిలో విడుదల చేస్తామని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. ఇక ప్రేక్షకులందరూ ఆ టీజర్ కోసం కళ్ళల్లో వత్తులేసుకుని ఆసక్తిగా జనవరి వరకు ఎదురు చూడాల్సిందే.