రియో ఒలింపిక్స్ లో అద్భుతమైన ఆటను ప్రదర్శించిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి ఖరీదైన కార్లకు మెయింటెన్ చేయలేక దీపా కర్మాకర్ తనకు ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును వెనక్కిచ్చేద్దామన్నట్లుగా ముమ్మరంగా నిన్నటికి మొన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్త అప్పట్లో దేశమంతా సంచలనం రేపింది. ఈ వార్త దీపా కర్మాకర్ రాష్ట్రమైన త్రిపురలోని రాజకీయ నాయకులను సైతం నిద్రపట్టనియ్యలేదు. ఈ విషయంలో ఒక్కసారిగా కదిలిన అగర్తలా మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఆ రోడ్లను చక్కదిద్దే పనిలో పడ్డాడు.
భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ బీఎండబ్ల్యూ కారు కోసం ఆమె నివాస ప్రాంతంలో ముఖ్యంగా రోడ్లు బాగు చేయిస్తున్నారు అధికారులు. దీపా కర్మాకర్ ఇంటివద్ద నుండి అంటే అభోయ్నగర్ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నింటినీ ఈ సందర్భంగా బాగు చేయిస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు. వెంటనే ఆమె ఇంటి నుంచి అగర్తలా మెడికల్ కాలేజి వరకు ఉన్న రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 78కోట్లు కేటాయించినట్లు తెలుస్తుంది. కాగా తన బీఎండబ్ల్యూ కారు ద్వారా అయినా ఈ రోడ్లకు మోక్షం రావడంతో ఈ విషయంపై దీపా కర్మాకర్ స్పందించింది. ఈ విధంగానైనా తమ ఊరి రోడ్లు బాగుపడుతున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇంకా ఆమె ఈ విషయంపై స్పందిస్తూ... నిజంగా తాను ఆ కారును మెయింటెన్ చేయలేకే తిరిగి ఇచ్చేద్దామనుకున్నానని, ఇందుకు కేవలం రోడ్లు మాత్రమే కారణం కాదని, ఇంకా కారు నిర్వహణ సర్వీసింగ్ లాంటివన్నీ కూడా సమస్యగానే ఉన్నాయని ఆమె వివరించింది.