సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఉద్యమ నేత, ప్రజానాయకుడి జీవితానికి సంబంధించిన చిత్రం తీస్తున్నట్లు ప్రకటించాడు. యథార్ధ ఘటనలు, జీవిత చరిత్రలు ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో వర్మకు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కెసిఆర్ జీవితానికి చెందిన ఆయన ఆలోచనా విధానాన్ని ఆధారంగా చేసుకొని ఓ సినిమా తెరకెక్కిస్తానని వర్మ వివరించాడు. ఆ సినిమాకు ఆర్.సి.కెగా పేరు కూడా అప్పుడే పెట్టేశాడు వర్మ. కాగా వర్మ కెసిఆర్ లో ఉన్న బహిర్కోణాన్ని కాకుండా అంతర్కోణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించనున్నట్లు వర్మ వివరించాడు.
అయితే గతంలో వర్మ మాట్లాడుతూ వంగవీటికి మించిన కథ మరొకటి లేదు అని దీని తర్వాత తెలుగులో సినిమానే తీయనని వెల్లడించాడు. ఇప్పుడు కూడా మరి కెసిఆర్ జీవితం వంటి గొప్ప చరిత్ర కలిగిన కథ మరొకటి ఉండదేమో అంటాడు చూడబోతేే. ఇంకో విషయం ఏంటంటే వర్మ అప్పట్లో సెక్స్ ను తిరగతిప్పి ఎక్స్.ఇ.ఎస్ అంటూ దీనిపై సినిమా తీస్తానని వెల్లడించి హాడావుడి చేశాడు. అయితే అది కార్యరూపం దాల్చలేదు సరికదా, ఆ తర్వాత దాని ఊసే లేదు. నిన్నటికి మొన్న పేరు మోసిన గ్యాంగ్ స్టర్ నయిూమ్ పై కూడా సినిమా చేస్తానని ప్రకటించేశాడు. అది మరి కార్యరూపం దాలుస్తుందో లేదో తెలియదు.
కాగా ఈ సందర్భంగా కెసిఆర్ కు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు వర్మ. కెసిఆర్ తెలంగాణకు దీపికా పడుకొనే అంత అందమైన బ్రూస్లీ అంటూ అభివర్ణించాడు. మొత్తానికి బాగానే పొగుడుతున్నాడు కానీ వర్మ ఈ సినిమా తీస్తాడా? లేకా ప్రకటణకే పరిమితమౌతాడా? అని ఆలోచనలో పడింది సినీజనం. వర్మ సహజంగా తాను ఏది దొరికితే అది సినిమాగా చేయాలని ఆతృతతో ప్రకటిస్తాడు గానీ అది కార్యరూపం దాల్చేంతవరకు వేచి చూడాల్సిందే.