హీరో నిఖిల్‌కు మొదటి నుంచి ప్రయోగాత్మక చిత్రాల ద్వారానే కలిసొచ్చింది. 'స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య' ఇలా ఆయన ప్రయోగాత్మక చిత్రాలను చేసిన ప్రతిసారి నిఖిల్ ను ప్రేక్షకులు ఆదరించారు. మధ్యలో కోనవెంకట్‌తో 'శంకరాభరణం' వంటి సాదాసీదా చిత్రం చేసిన నిఖిల్ కు ఎదురుదెబ్బ తగలింది. ఇక 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రం పెద్ద హిట్ కాకపోయినా మంచి ప్రయోగంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'శంకరాభరణం'తో ఒకసారి దెబ్బతిన్న నిఖిల్ మరలా తన పాతరూట్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సారి నిఖిల్.. ఆత్మ చుట్టూ తిరిగే కథను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సందీప్‌కిషన్‌తో 'టైగర్' చిత్రం చేసిన దర్శకుడు ఆనంద్ తాజాగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్‌లో ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. మరోపక్క తనకు 'స్వామి రారా'తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు సుధీర్‌వర్మ 'దోచెయ్' వంటి ఫ్లాప్ చిత్రం అనంతరం మరలా నిఖిల్‌తో 'కేశవ' అనే చిత్రంకు నంది పలకనున్నాడు. 'స్వామిరారా'తో దేవుడి విగ్రహం, 'కార్తికేయ'తో దేవాలయం బ్యాక్‌గ్రౌండ్ వంటి విభిన్నపాయింట్లలో నటించిన నిఖిల్ ఇప్పుడు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో ఆత్మ పాయింట్‌ను, 'కేశవ'చిత్రంతో మరోసారి దేవుడి బ్యాగ్రౌండ్ వంటి చిత్రాలు చేస్తున్న నిఖిల్.. ఈ చిత్రాలతో పెద్ద పెద్ద విజయాలు అందుకోవాలని ఆశపడుతున్నాడు.