ఎం.ఎస్ ధోని చిత్రం బంపర్ హిట్ కొట్టాక సినీ పరిశ్రమ అంతా జీవిత చరిత్రలను తెరకెక్కించే పనిలో పడింది. ఆ దిశగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్రను ఒక సినిమాగా మలచాలని చూస్తున్నారు సినీ ప్రముఖులు. అయితే ఇక్కడ వీరందరికీ సుదీర్థమైన వీరి చరిత్రను ఎలా మొదలెట్టాలి ఎలా ఎండ్ చేయాలన్న దానిపైనే తికమక పడుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ దర్శక నిర్మాత అయిన మధుర శ్రీధర్ ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా, రధసారథిగా వ్యవహరించిన ఓ శక్తిగా మూడే మూడక్షరాల కె.సి.ఆర్ చరిత్రను సినిమాగా రూపొందించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ సందర్భంగా మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకొని అందులో పాల్గొన్న కుటుంబంలోంచి వచ్చిన నేను 1969 నాటి విషయాలు, ఈనాటి తెలంగాణ ఉద్యమ ప్రత్యక్ష పోరాటాలు చూసి నాలోని దర్శకుడు బయటకు వచ్చాడు. ఆ దిశగా తెలంగాణ ఉధ్యమానికి ధీటుగా జరిపిన కొందరి ప్రపంచ నాయకుల చరిత్రలపై పరిశోధనలు చేసాను. మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి గొప్ప నాయకుల జీవితాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కెసిఆర్ జీవితం ఉంటుంది. అందుకనే కేసీఆర్ జీవితాన్ని తెరకెక్కించాలని దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నాను..అని తెలిపాడు. అయితే 2017 జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం రోజు తన దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కెసిఆర్ పుట్టినరోజుకి సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తానన్నాడు శ్రీధర్. కాగా కెసీఆర్ జీవితానికి తెలంగాణ ఉద్యమానికి విడదీయరాని సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఉద్యమానికి ఊపిరిలా ఆయన చేసిన నిరాహార దీక్ష ఒక్కటే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి కీలకంగా మారిన అంశంగా చెప్పవచ్చు. ఆ తర్వాత, అప్పటి నుండి కెసిఆర్ కేంద్రంగా జరిగిన ఉద్యమాలు, తెలంగాణ వ్యాప్తంగా జరిపిన ప్రజా ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావానికి కీలకంగా నిలిచినవని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కెసిఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు. ఉద్యమంలో కెసిఆర్ తప్పుకుండా ఉన్నాడు. అంటే ఉద్యమమే కెసిఆర్, కెసిఆరే ఉద్యమం అనవచ్చు.