ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోవు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జనాకర్షణ పథకాలను ప్రవేశ పెట్టనున్నాడు. తాజాగా చంద్రబాబు సంక్షేమ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఓ కొత్త పథకాన్ని ప్రకటించాడు. రాబోవు కాలంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వారికి నెలకు 50 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇవ్వనున్నట్లు వెల్లడించాడు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రభుత్వం నిధులను సక్రమమైన రీతిలో ఖర్చు చేసే నిమిత్తం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులకు వివరించాడు బాబు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ తెదేపా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బీసీలను సబ్ ప్లాన్ కిందికి తీసుకు వచ్చామని, ముస్లింల సంక్షేమానికి పెద్దయెత్తున బడ్జెట్ ను కేటాయించామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా 2019 లో వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలవడం కోసం ఈ రకంగా మైనారిటీలను బుట్టలో వేసుకొనేందుకే ఇటువంటి కొత్త పథకాన్ని బాబు ప్రవేశ పెట్టాడని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి నుండే బాబు బీసీలు, వెనుకబడిన వర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకు కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాడని వారు వెల్లడిస్తున్నారు. ఆ రకంగా బాబు ఇప్పుడు ప్రవేశ పెట్టనున్న 50 యూనిట్ల ఉచిత కరెంటు కూడా అటువంటి దాని కిందికే వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు మొన్న కోడలు బ్రాహ్మణి జరిపిన సర్వేల ఆధారంగా ఎప్పటికప్పుడు రాజకీయ, సామాజిక అంచనాలతో ఓటర్లే లక్ష్యంగా, రాబోవు ఎన్నికల్లో గెలిపే పరమావధిగా ముందుకు వెళ్తున్నట్లుగానే అర్థమౌతుంది.