ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైకాపా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. విభజన కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని గళం విప్పిన 12మంది వైకాపా సభ్యులకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నెల 25, 26 తేదీలలో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శి ఆ నోటీసుల్లో పేర్కొన్నాడు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటూ వైకాపా ఎమ్మెల్యేలంతా సభను స్తంభింపచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడంపై వైకాపా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే నోటీసులు ఇస్తారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
కమిటీ ముందు హాజరై తమ ప్రవర్తన పట్ల వివరణ ఇవ్వాలంటూ తాజాగా ఇచ్చిన నోటీసుల ద్వారా తెలుస్తుంది. వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్ కుమార్, ముత్యాలనాయుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజయ్య, కొరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు నోటీసులు జారీ అయిన వారిలో ఉన్నారు.
ఈ విషయంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురౌతున్నారు. వైకాపాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వడం విషయంలో ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డాడు. వైకాపా ఎమ్మెల్యేలు ఏం నేరం చేశారో తెలపాలని ఆయన ప్రశ్నించాడు. కేవలం ప్రత్యేకహోదా కోసం సభను స్తంభింపజేయడం తాము చేసిన తప్పా అంటూ ఆయన అడిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 మంది ఎమ్మెల్యేలనే కాదు, మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినా ప్రత్యేక హోదాపై తమ పోరాటం ఆగదని ఆయన వివరించాడు. వైకాపా నుండి గెలుపొంది తెదేపాలో చేరిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించామని తాము కోరుతున్నా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని, కానీ ప్రత్యేక హోదా అడిగినందుకు మాత్రం తమ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారని ఆయన విమర్శించాడు.