ప్రతిరోజు కేసీఆర్ ప్రభుత్వానికి చిడతలు వాయించే 'నమస్తే తెలంగాణ' మంగళవారం కూడా అనుకూల వార్త ప్రచురించింది. కొత్త జిల్లాల ప్రస్తావన తెస్తూ 'ఇంటికొచ్చిన ప్రభుత్వం' అంటూ బ్యానర్ కథనం రాసింది. జిల్లాల పునర్విభజన ఫలాలు ప్రజలకు అందుతున్నట్టు డెస్క్ కథనం రాశారు. పది జిల్లాలను 31 జిల్లాలు చేసి గందరగోళంలో పడేసిన కేసీఆర్ తీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని మరిచింది. మండల స్థాయిని జిల్లాగా మార్చడం, డిఎస్ పి ఉండాల్సిన చోట ఎస్. పి. ఉండడం, జాయింట్ కలెక్టర్ సరిపోయే చోట కలెక్టర్ ను పెట్టడం వల్ల వారు పరిమితంగానే పాలించాల్సి వస్తోంది. ప్రజల అభిప్రాయాలకు విరుద్దంగా మండలాలను కొత్త జిల్లాల్లో కలిపారు. ఈ తీరును వ్యతిరేకిస్తూ ఇప్పటికే నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్తలేవీ 'నమస్తే..'కు కనిపించలేదు. ఆదివాసి గ్రామాలకు వైద్యులు వెళ్లి చికిత్స చేయడం పే...ద్ద డెవలప్ మెంట్ గా ఆ పత్రికకు కనిపించింది. ఆదివాసిలకు వైద్యం అందించడం కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉంటాయి. జిల్లా కేంద్రం దూరంగా ఉండి గతంలో వైద్యం చేయలేదని ఆ పత్రిక ఉద్దేశంలా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం గత రెండున్నర ఏళ్ళుగా ఆదివాసి గ్రామాలకు వైద్య సౌకర్యం కల్పించలేదని ఆ పత్రిక చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తోంది.
నకిలీ విత్తనాలు. వరదలకు మునిగిపోయిన పంట, హాస్పటల్లో వైద్య సేవలు వంటి విషయాలు 'నమస్తే.'.కు కనిపించడం లేదు. సరిగ్గా మంగళవారమే 'ఈనాడు' పత్రిక ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఎండగట్టింది. మారుమూల గ్రామాలకు అందుతుందని చెబుతున్న వైద్యం ఆసుపత్రుల్లో ఎందుచేత అందడం లేదనే విషయాన్ని 'ఈనాడు' వెలికితీసింది. కొత్త జిల్లాల వల్ల ఆసుపత్రులు మూలపడ్డాయా? వాటి పర్యవేక్షణ కలెక్టర్, వైద్య అధికారులు మారిచారా? ఈ విషయాన్ని 'నమస్తే...' గ్రహిస్తే మంచిది. కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి భజన చేయడం కంటే ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తేనే పత్రికలు ప్రజల పక్షాన నిలిచినట్టు అవుతుంది. పత్రికలను ప్రజలు కొంటారు. వాటిలో ప్రచురించే ప్రకటనలు ప్రజలు చూడ్డానికే. ఈ రెండు మార్గాల ద్వారా ఆదాయం పొందే 'నమస్తే తెలంగాణ' పత్రిక మాత్రం ప్రభుత్వానికి కొమ్ముకాస్తు సమస్యలను, ప్రజలను విస్మరిస్తోంది.