ప్రముఖ మీడియా సంచలనం, జర్నలిస్ట్, టైమ్స్ నౌ ఛానల్ లో ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్న అర్నాబ్ గోస్వామిని కేంద్ర ప్రభుత్వం విలువైన వ్యక్తిగా భావించింది. అందుకోసం అతనికి ‘వై’ కేటగిరి భద్రతని కల్పించింది కేంద్రం. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశమంతా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇకనుండి అర్నాబ్ గోస్వామి చుట్టూ 24 గంటలు భద్రతా వలయం వెన్నంటి ఉంటుంది. అయితే ఇంతటి స్థాయిలో ‘వై’ కేటగిరి భద్రతను అత్యంత ప్రముఖ వ్యక్తులకు మాత్రమే కల్పిస్తారు. ‘వై’ కేటగిరి భద్రతను కల్పించడంలో కేంద్రం మంత్రులకు, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే అసలు ఇప్పుడు ఉన్నట్టుండి ఓ జర్నలిస్టుకు వై కేటగిరి భద్రత కల్పించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..?
కారణం ఉందండి. అర్నాబ్ గోస్వామి చర్చా వేదికల ద్వారా మంచి హాట్ హాట్ విషయాలను చర్చిస్తూ ఆయా విషయాలపై సర్వ సమగ్రంగా చర్చలను నిర్వహిస్తుంటాడు. కాశ్మీరులోని ఉరి ఘటన, ఆ తర్వాత భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు సంబంధించి అర్నాబ్ టివి కార్యక్రమంలోని చర్చా వేదికలో పాక్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. దీంతో పాక్ నుండి అర్నాబ్ గోస్వామికి ఏమైనా ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉండటంతో ఈ భద్రతను కల్పించినట్లు తెలుస్తుంది. ఇంకా అర్నాబ్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండే అవకాశం ఉందని ముందుగానే తెలుసుకున్న కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది అర్నాబ్ కు రక్షణగా ఉంటారు. ఇంకా మరో ఇద్దరిని వ్యక్తిగత భద్రతా అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. దీంతో ప్రభుత్వం నుంచి ‘వై’ కేటగిరీ భద్రతను పొందిన మొదటి జర్నలిస్ట్ అర్నాబ్ కావడం మీడియాకే గర్వకారణంగా చెప్పవచ్చు.