నటుడు పోసాని కృష్ణమురళి దర్శకుడు బోయపాటి శ్రీనుపై విరుచుకుపడ్డారు. బోయపాటి వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహించారు. అతడికి కృతజ్ఞత లేదని విమర్శించారు. ఈ ఆవేశానికి, ఆగ్రహానికి కారణమేమిటో కూడా ఆయనే వివరించారు. ఆదివారం ఒక టీవీ ఇంటర్య్వూలో పోసానితో చేసిన ఇంటర్య్వూలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పోసాని దగ్గర పనిచేసిన అనేక మంది ఆ తర్వాత దర్శకులుగా రాణిస్తున్నారు. వీరిలో బోయపాటి కూడా ఉన్నాడు. బోయపాటిది కడు పేదకుటుంబమని, అతడి తండ్రి ఒక మసీదులో నెలకు 250 రూపాయలకు జీతంతో వాచ్ మెన్ గా చేసేవాడు. బోయపాటి శ్రీను అన్నయ్య తమ కుటుంబపరిస్థితిని వివరించి, తమ్ముడికి ఏదైన పని ఇప్పించండని ప్రాధేయపడితే, శ్రీనును హైదరాబాద్ పిలిపించి, ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టించాను. క్రమంగా ఎదిగి అతను దర్శకుడయ్యాడు. మరోవైపు నేను రచయిత నుండి దర్శకుడిగా మారి, 'శ్రావణమాసం' అనే సినిమా తీసి నష్టపోయాను. అప్పుడు బోయపాటి మా ఇంటికి వచ్చి మా ఆవిడతో నా గురించి ఎంతో జాలిగా మాట్లాడాడు. సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి మీ కుటుంబం గడవడం కష్టం. నేనంటే దర్శకుడిగా సక్సెస్ అయ్యాను అంటూ అవహేళనగా మాట్లాడి, మమ్మల్ని హర్ట్ చేశాడు. నా దగ్గర పనిచేసిన త్రివిక్రమ్, సంపత్ నంది, కళ్యాణ్ కృష్ణ వంటి వారంతా ఎంతో అభిమానం చూపిస్తే, బోయపాటి మాత్రం హేళనగా మాట్లాడాడు అని పోసాని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు బోయపాటి భార్య అనారోగ్యం గా ఉన్నపుడు హాస్పటల్ ఖర్చులన్నీ మా ఆవిడే కట్టింది. ఇంతచేసినా బోయపాటి శ్రీనుకు ఎలాంటి కృతజ్ఞత లేదని అన్నారు.