తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత 25రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే జయలలితకు అత్యంత సన్నిహితుడైన రజనీకాంత్ తాజాగా తన కూతురు ఐశ్వర్య ధనుష్ తో కలిసి అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్యపరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా జయలలితకు ప్రస్తుతం లండన్ వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్య బృందం చికిత్స జరుపుతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి జయలలితకు మెరుగైన వైద్యం అందించడం కోసం సింగపూర్‌లోని ప్రఖ్యాత మౌంట్ ఎలిజిబెత్ ఆసుపత్రికి చెందిన మహిళా వైద్యులను కూడా చెన్నైకి పిలిపించి ప్రత్యేక చికిత్స చేస్తున్నారు. సింగపూర్ నుండి వచ్చిన వైద్యులు జయలలితకు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చికిత్స జరుపుతున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కాగా ఈ విషయాన్ని అంటే.. సింగపూర్ నుంచి వైద్యులు వచ్చిన విషయంపై అపోలో అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది ఇలా ఉండగా జయలలిత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న వదంతులు, ఆరోపణలను అధిగమించేందుకు పార్టీ ఓ సెల్ ను ఏర్పాటు చేసింది.
కాగా ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిస్థితి అయోమయంగా ఉంది. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ప్రజలకు ఏ ఒక్కరూ కూడా పూర్తి క్లారిటీని ఇవ్వడంలేదు. అందుకనే అమ్మ అభిమానులను బెంబేలెత్తించేలా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం మాత్రం రూమర్లు సృష్టిస్తున్నారంటూ నెటిజన్లపై కేసులు పెడుతోంది గానీ అమ్మకు ఏమైంది అన్న విషయంపై పూర్తి స్పష్టతను ఇవ్వడం లేదు.
ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రిని పరామర్శించేందుకు జాతీయ స్థాయి ముఖ్య నేతలంతా ఒక్కొక్కరుగా వస్తున్నారు, వెళ్తున్నారే గానీ ఏ ఒక్కరూ నోరు విప్పి నిజం చెప్పడం లేదు. అందుకనే ప్రజలలో అసలు అమ్మకు ఏమైందోనన్న ఆందోళన అసహనం ఎక్కువైంది. కాగా ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగితే ఇక ప్రజలు సహనాన్ని కూడా కోల్పోతారు. అలాగే జరిగితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. కానీ ప్రస్తుతం తమిళనాట అమ్మ తరువాత ప్రజలు అంతగా నమ్మే వ్యక్తుల్లో రజనీకాంత్ ఒకరు. పైగా ఆయనకు జయతో సన్నిహితం కూడా ఎక్కువే. ఇలాంటి సమయంలో రజనీకాంత్ జయలలిత చికత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్ళి వైద్యుల ద్వారా సమాచారాన్ని మాత్రమే అడిగి తెలుసుకొని బయటకి వచ్చారే తప్ప ప్రజలకు ఎటువంటి భరోసాను కల్పించేలా మాట్లాడలేదు. ఎటువంటి ప్రకటన చేయలేదు.