తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కేంద్రంగా సర్వం తానై చూసుకుంటున్న నారా లోకేష్ ను ఎట్టకేలకు మంత్రి పదవి వరించనుంది. తెదేపాలో చంద్రబాబు తర్వాత రెండవ స్థానంగా చెప్పుకుంటున్న నాయకులకు ఇది మంచి వార్తనే చెప్పాలి. ఇన్నాళ్ళు లోకేష్ ను ఎక్కడ నుండి ఎలా రాజకీయాల్లోకి ప్రవేశ పెట్టాలా? ఏ విధంగా మంత్రిని చేయాలా? అని ఆలోచిస్తున్న బాబుకు ఉన్నట్టుండి ఓ ఆలోచన తట్టింది. లోకేష్ కోసం చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమ పదవుల త్యాగానికి ముందుకొచ్చి మరీ ఆఫర్స్ ఇచ్చారు. పార్టీలో ఏ పదవిలో లేని వ్యక్తులు పార్టీ, రాజకీయ పరమైన అంశాల్లో తలదూర్చడానికి వీలులేదంటూ ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి కూడాను. అందుకోసం బాబు ఎలాగైనా లోకేష్ ను పార్టీలో మంచి పదవి ఇచ్చి తగిన విధంగా రాజకీయాన్ని నేర్పాలని భావిస్తున్నాడు. అందుకోసం పార్టీ, నాయకుల నుండి అనుకూల స్పందనే వచ్చింది.
అయితే చంద్రబాబు ఓ ఆలోచన చేశాడు. ఇప్పుడు ఉన్నట్టుండి లోకేష్ కి మంత్రి పదవి కట్టబెడితే మరో ఆరునెలల్లో తప్పకుండా ఎదో ఒక శాసనసభ సీటుకు రీ ఎలక్షన్ జరపాలి. అసలే ప్రతిపక్షాలు ప్రతిదీ అద్దంలో చూపెడుతుండటంతో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడు బాబు అని బురద జల్లుతుండటంతో ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వని ఆలోచన చేశాడు ఇప్పుడు చంద్రబాబు. లోకేష్ రాజకీయ ప్రవేశం కోసం సరైన సమయం కోసం వేచి చూస్తున్న బాబుకి ఇప్పుడు మండలి ఎన్నికల ద్వారా మంచి ఛాన్స్ వచ్చింది. ఈ మండలి ఎన్నికలు పట్టభధ్రులు, ఉపాద్యాయులు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. కనుక లోకేష్ ను పట్టభద్రుల కేటగిరీలో బరిలోకి ప్రవేశ పెట్టి అందులో గెలిపించి సభలోకి తీసుకోవాలని బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చంద్రబాబు, చినబాబు కోసం మంచి ఆలోచనే చేశాడండోయ్.