ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకూ హాట్ హాట్ గా మారుతుంది. ప్రస్తుత రాజకీయం అంతా భీమవరం మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ కేంద్రంగా జరుగుతుంది. అక్కడ జొన్నలగురువులో మొదలు కాబోతున్న మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాలలోని రైతులంతా కలిసి హైదరాబాద్ వచ్చి మరీ వారి గోడును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వెళ్ళబోసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇస్తూ.. టీడీపీ నేతలకు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను ఈ సమస్యను కూలంకషంగా వివరించి తగిన పరిష్కారాన్ని చూపేలా ఒత్తిడి చేస్తానని వెల్లడించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఇటువంటి సమస్యలు పోలీసులతో పరిష్కారం కాకపోగా, మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించాడు.
విషయం ఏంటంటే పవన్ ఏదైతే తన పార్టీ పరమైన ప్రణాళికను కార్యకలాపాలను చేయడానికి పూనుకొని ప్రకటించిన క్షణాల్లోనే అదే పనిపై జగన్ దాన్ని ఆచరణాత్మకంగా చేయడానికి సిద్ధమౌతున్నాడు. పవన్ అలా మాటేస్తున్నాడో లేదో జగన్ ఇలా చేసేసుకుంటున్నాడు. గత కొన్ని నెలలుగా పవన్ కేంద్రంగా జగన్ అడుగులు పడుతున్నాయి. మొన్న ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇదే జరిగింది. పవన్ ప్రత్యేక హోదాపై పోరాటానికి ప్రణాళికను మాత్రమే వేసుకొని ఆగిపోగా, జగన్ ప్రత్యేక హోదాపై పోరాటాన్ని దశలు వారీగా ఆచరించి చూపాడు. ఇప్పుడు మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా కూడా పవన్ డీల్ చేస్తున్న విధానాన్ని జగన్ ప్రత్యక్షంగా ప్రజల మధ్యలోకి వెళ్లి వారితో పోరాటం జరుపుతూ సమస్యలపై ప్రభుత్వానికి తెలిపేలా కార్యక్రమాలు చేస్తున్నాడు. కాగా పవన్ ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది సేపటికే వైకాపా నాయకుడు జగన్ ఈ అంశంపై తన కార్యాచరణను ప్రకటించేశాడు. ఇదే విషయాన్ని ఆ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మీడియాకు వెల్లడించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీనాడు జిల్లాలో పర్యటించనున్నాడని వివరించాడు. అయితే ఈ ఆందోళనల కారణంగా ప్రభుత్వం అక్కడ పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించింది. ఇలా రాబోవు ఎన్నికల్లో పవన్ ఏపీలో కీలకంగా మారనుండటంతో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాన్ని జగన్ నిరంతరం అనుసరిస్తున్నట్లుగా జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తుంది.