జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెదేపాకు గట్టి వార్నింగే ఇచ్చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా మెగా ఆక్వా ఫుడ్స్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలతో కలిసి జరిపిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ అధికార తెదేపాను గట్టిగా మందలించాడు. కేవలం తమ పార్టీ అండదండల ద్వారానే అధికారంలోకి వచ్చిన తెదేపా ఇప్పుడు తమ అభ్యర్థనలు అంగీకరించాలి, సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగా పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చంద్రబాబుపై బాణం ఎక్కుపెట్టాడు. కాగా ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతుంటాడులే అతన్ని వదిలేయండని చెప్పుకుంటూ వదిలేసుకుంటూ వచ్చిన అధికార తెదేపా అధినేత బాబు కనుసన్నలలోని నేతలు ఈసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అధినేత కనుసన్నలతోనే మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్.. పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ ఇచ్చాడు.
కాగా వైవిబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మెగా ఆక్వాఫుడ్స్ వలన పర్యావరణానికి, పంటలకు ఎటువంటి నష్టం లేదని ఆయన వివరించాడు. అందుకు సంబంధించి పొల్యూషన్ బోర్డు కూడా ఈ ప్రాజెక్టును పొల్యూషన్ ఫ్రీ ప్రాజెక్టు అని నిర్ధారించిందని వెల్లడించాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే.. పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని మాట్లాడితే బాగుండేది అని, అలా కాకుండా మాట్లాడటం ద్వారా పార్టీ అధినేతలను దీనికి సంబంధించి కనీస పరిజ్ఞానం లేని వారుగా ప్రజలు గుర్తించాల్సి వస్తుందని ఆయన వివరించాడు. అయితే ఇలా ఎలాపడితే అలా మాట్లాడటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తెలిపాడు. కాగా ప్రభుత్వం ఇక్కడి ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4000 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, ఇటువంటి మంచి పనికోసం చేపట్టే ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు ఆలోచించుకొని అడుగువేయాలని పవన్ ను పరోక్షంగా రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించాడు.