పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు గ్రామాల రైతులు శనివారం 'జనసేన' అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సమావేశం నిర్వహించారు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో జరిగిన ఈ సమావేశంలో ఆయా గ్రామాల రైతులంతా కలిసి తమ సమస్యలన్నింటినీ పవన్ సమక్షంలోనే ప్రత్యక్షంగా జనసేన అధినేతకు వెల్లడించడం జరిగింది. భీమవరంలోని ఆక్వాఫుడ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల రైతులు ఓ ఉద్యమంలా హైదరాబాద్ వచ్చి పవన్ ను కలిశారు. వారు వివరించే విషయాన్ని జాగ్రత్తగా ఆలకించిన పవన్ ఈ ప్రజా పోరాటానికి మద్దతిస్తామని ప్రకటించాడు.
కాగా పవన్ ఈ ప్రెస్ మీట్ ను విచిత్రంగా ఏర్పాటు చేశాడు. ప్రత్యక్షంగా చంద్రబాబు ప్రభుత్వం గుర్తించేలా, తాను పాలిస్తున్న, శాశిస్తున్న రాజకీయ విధానాన్ని అలా తెలియపరిచేలా చెప్పకనే చెప్పాడు పవన్. కాగా ఫ్యాక్టరీ వద్దే వద్దని, తమకు న్యాయం జరిగేలా ఆయా గ్రామాలలోని రైతులు, స్త్రీ పురుషులు ఇద్దరూ వచ్చి తమ గోడును పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళబోసుకోవడం జరిగింది. ఇంకా తమకు న్యాయం జరిగేలా చూడాలని కూడా ఆయా గ్రామాల రైతులు పవన్ ను కోరారు. తామంతా కలిసి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రెండున్నర సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నామని, ఇది అన్యాయమని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఇంకా యువత, పిల్లలే కాకుండా, మహిళలపై కూడా కేసులు పెడుతున్నారని మహిళలు వివరించారు. ఇంకా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రైతుల భూములు లాక్కొంటున్నారని, రైతులు వలస పోయే పరిస్థితి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల గొంతేరు కాలువ విషతుల్యమవుతుందని, లక్షలాదిమంది పొట్ట కొడుతున్నారని చెప్పారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తమకు న్యాయం జరిగేలా చూస్తారని తామంతా భావిస్తున్నామని వారు తెలిపారు.
అయితే ప్రత్యక్షంగా ఆయా రైతుల గోడు అంతా విన్న పవన్ కళ్యాణ్ తెదేపా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాడు. అదేంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ కమిటీ వేయాలని, ఈ సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే జనసేన పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో తాము ఉద్యమించి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని వివరించాడు. కాబట్టి తెదేపా ప్రభుత్వం అంతవరకు తెచ్చుకోకుండా సానుకూలంగా సమస్యను పరిష్కరించాలని కోరాడు. అయితే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చాలా కాలం నుండి అటు కమ్యూనిస్టు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో పవన్ పార్టీ చాలా ఆలస్యంగా కన్ను తెరిచిందనే చెప్పాలి.