మెగాస్టార్ చిరంజీవి వెండితెర నుండి బుల్లితెరకు షిప్ట్ అయ్యారు. 150 చిత్రాల్లో నటించిన ఈ స్టార్ హీరో ఆకస్మాత్తుగా టీవీ వ్యాఖ్యతగా మారడం చాలామందిని ఆశ్చర్యం కలిగిస్తోంది. సంక్రాంతికి ఆయన నటించిన 'ఖైదీ నంబర్ 150' రిలీజ్ అవుతుందని నిర్మాత ప్రకటించారు. దీనికంటే నెల రోజుల ముందు చిరంజీవి వ్యాఖ్యతగా రియాలిటీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రసారం మొదలవుతుంది.
నాగార్జున మూడు సెషన్స్ నిర్వహించిన 'మీలో...' కు కొనసాగింపు సెషన్స్‌లో చిరంజీవి కనిపిస్తారు. నాగ్ తప్పుకున్నాడు కాబట్టి ఆ అవకాశం చిరుకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (74) 'కౌన్ బనేగా క్రోర్‌పతి' (కెబిసి) వ్యాఖ్యతగా తన రెండవ ఇన్నింగ్ ప్రారంభించారు. 2000వ సంవత్సరం నుండి ఎనిమిది సెషన్స్‌లో కెబిసీ ప్రసారమైంది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ మూడు సెషన్స్ చేశారు. ఆ రోజుల్లో కెబిసి కారణంగా సినిమాలకు కలక్షన్లు తగ్గిపోయాయని ఎగ్జిబిటర్లు గగ్గోలు పెట్టారు. రియాలిటీ షోకి అంతటి క్రేజ్ తెచ్చింది అమితాబే అనే విషయం తెలిసిందే. పైగా ఆ రోజుల్లో అమితాబ్‌కు సినిమాల్లో స్టార్‌డమ్ పడిపోయిన సమయంలో కెబిసి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన పుంజుకుని మళ్లీ స్టార్‌డమ్ నిలుపుకున్నారు. ఇదే బాటలో వెళుతున్న మెగాస్టార్ పరిస్థితి అమితాబ్‌కు కొంచెం దగ్గరగా కనిపిస్తోంది. తొమ్మిదేళ్ళుగా వెండితెరకు దూరంగా ఉన్న చిరు మళ్లీ పూర్వవైభవం కోసం హడావుడి చేస్తున్నారు. సినిమా రిలీజ్ సమయానికి ప్రేక్షకుల దృష్టి తనవైపు తిప్పుకునేలా ప్లాన్‌లో ఉన్నారు. దీనికి మీలో ఎవరు కోటీశ్వరుడు ఏ మేరకు ఉపయోగపడుతుందనేది చూడాలి. మన మెగాస్టార్, అమితాబ్‌లా పుంజుకుంటారా? ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్.