తమ దగ్గర ఉన్న నల్లదనాన్ని వెల్లడించి దానికి సంబంధించిన ట్యాక్స్ కడితే నల్లదనం బయటకు వస్తుందని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి బాగా మంచి స్పందన వస్తోంది. అలా పన్నులు కట్టిన వారి పేర్లను, ప్రాంతాలను, ఇతర విషయాలను కేంద్రం గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ నాయకుడు 10వేల కోట్ల నల్లదనాన్ని చూపి పన్నులు కట్టాడనే వార్త ఇప్పుడు అసలు వివాదానికి కారణం అయింది. అది జగనే అని కొందరు అంటుంటే.. వైకాపా పార్టీ మాత్రం అది తాము కాదని, చంద్రబాబుకు బినామీగా ఉన్న వారు అలా కట్టిన వారిలో ఉన్నారని ప్రత్యారోపణలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో తమ పేర్లను, నివాస స్దలాల వంటివి ప్రకటించమని, దానిని గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఈ విషయాలు ఎలా లీక్ అయ్యాయి? ఎలాంటి గోప్యత లేకుండా పేర్లు బయటపెట్టుకొని చంకలు గుద్దుకుంటున్న తమ తమ నాయకుల పేర్లు బయటకు వస్తే ఎలా? అసలీ ఆరోపణలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనా? లేక కేంద్రం తమ పరిపాలనలో ఇలా లొంగిపోయిన వారి వివరాలు తమదగ్గర ఉంచుకొని వాటి నుండి రాజకీయ లబ్దిని అశిస్తోందా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా దేశంలో వెయ్యినోట్లు, ఐదొందల నోట్లను తప్పించి వంద కాగితాలతోనే ఆపితే నల్లదనాన్ని ఆపుచేయగలమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధానిని కోరారు. అన్ని వస్తువులు కొనుగోలుకు క్యాష్ లెస్ కార్డ్‌లను ఉపయోగిస్తే బాగుంటుందనే ఆయన సలహా. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ విషయాలన్నింటిపై గట్టిగా నిలబడి భవిష్యత్తులో నల్లదనం చేకూరకుండా చేయాలని చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం అవ్వాలని అత్యధికులు కోరుతున్నారు. కానీ కొందరు మాత్రం ఈ విషయాన్ని రాజకీయం కోణంలో రచ్చ రచ్చ చేస్తున్నారు.