బాలీవుడ్ లో బయోపిక్ లు బాగానే నడుస్తున్నాయి. అదీ ఈ మధ్యనే జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఎం.ఎస్ ధోనీ చిత్రం జనాదరణ పొందటంతో దర్శక నిర్మాతలు ఇక బయోపిక్ లపై పడుతున్నారు. ఈ దిశగా సినిమాలు తీయడానికి మోజు చూపుతున్నారు. అజారుద్దీన్, మేరీ కాం సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్ ఈ మధ్య వచ్చిన ధోనీ సినిమాతో అటువంటి చిత్రాలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఎం.ఎస్ ధోనీ సినిమాలో ఆఫ్ స్క్రీన్ లో గ్రౌండ్ లలో అదరగొట్టిన ధోని తెరమీద కూడా తిరుగులేదంటూ విజృంభించాడు. ధోనీ సినిమా కలక్షన్ ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలైన నాటి నుండి వీరలెవల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ చిత్రం. దాంతో ఇటువంటి చిత్రాలను తీసేందుకు దర్శక నిర్మాతలు అమితంగా ఆసక్తిని చూపుతున్నారు.
ఇకపోతే ఆ దిశగానే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంపై పరిశ్రమలో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ విషయంపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. బాలీవుడ్ లో వస్తున్న బయోపిక్ సినిమాలన్నీ స్ఫూర్తినింపేవిగా ఉన్నాయని, వ్యక్తిగతంగా యువరాజ్ సింగ్ జీవితం తనకు చాలా ఆసక్తి కొలిపేలా ఉందని అబిషేక్ తన అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఇంకా అబిషేక్ మాట్లాడుతూ.. యువరాజ్ జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయని, ఎన్నో ఎత్తుపల్లాలు అదిగమించి, ముందుకు దుమికిన క్రీడాకారుడు యువీ అనీ వివరించాడు. కాగా ఈ యువరాజ్ సింగ్ జీవితకథ ఆధారంగా సినిమా నిర్మిస్తే చాలా ఇన్ స్పైరింగ్ గా కూడా ఉంటుందని అబిషేక్ వెల్లడించాడు. మొత్తానికి యువరాజ్ సింగ్ బయోపిక్ పై కూడా సినిమా సిద్ధమౌతుందన్న మాట. అలాంటిదేం లేకపోతే అబిషేక్ అలా బహిరంగంగా మాట్లాడడు కదా అంటున్నారు సినీజనం. ఇంకో విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు కానీ యువరాజ్ సింగ్ పై సినిమా తీయడానికి ముందుకొస్తే తాను యువీ పాత్రలో నటించేందుకు అభిషేక్ సిద్ధంగా ఉన్నాడని కూడా సమాచారం. మరి ఈ విషయంలో యువరాజ్ సింగ్ స్పందనేంటో తెలియాల్సి ఉంది.