తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత ఇరవై రోజులగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఉన్న జయలలితను పలువురు కేంద్రం పెద్దలు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కాగా ఇప్పుడు జయలలిత నిర్వహిస్తున్న రాష్ట్ర శాఖలను ఆర్థిక శాఖామంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించడంపై డీఎంకే అధినేత కరుణానిధి తీవ్రంగా మండిపడ్డాడు. ఈ సమయంలో పన్నీరు సెల్వంకు కొత్తగా అదనపు బాధ్యతలు అప్పగించడంపై ఆయన ఆశ్చర్యానికి లోనయ్యాడు. గవర్నర్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడంపై కరుణానిధి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. కాగా ఈ అంశంపై గత అర్థరాత్రి రాజ్ భవన్ నుండి ప్రకటన విడుదల అయిందని ఈ విషయంపై తాము అసంతృప్తితో ఉన్నామంటూ చెలరేగిపోయాడు.
జయలలిత ఆరోగ్యం విషయంపై గత వారం కరుణానిధి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సూచించగా మంత్రి పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు ఇస్తున్నామని గవర్నర్ ప్రకటనలో తెలిపారు. అసలు గడచిన 19 రోజులు నుండి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. అటువంటప్పుడు సీఎం సూచన మేరకు అని గవర్నర్ ఏ విధంగా ప్రకటిస్తాడంటూ కరుణానిధి చెలరేగిపోయాడు. గవర్నర్ జారీచేసిన ఈ అంశాలు చదివిన వారికి ఇలాంటి సందేహం కలగకపోదు అంటూ ఆయన వివరించాడు. ఇంకా కరుణానిధి మాట్లాడుతూ... జయలలితను పరామర్శించేందుకు వెళ్ళిన ఇన్ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుగానీ, కేరళ సీఎం విజయ్ గానీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీగానీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగానీ వీరిలో ఏ ఒక్కరూ కూడా జయను కలిసి పరామర్శించి వచ్చినవారు కాదని, వాళ్ళంత అస్సలు ఆమెను చూడను కూడా చూడకుండా వైద్యులతో మాట్లాడి వచ్చినవారేనని కరుణానిధి వెల్లడించాడు. తాను మొదటి నుంచి వాపోతున్నట్లుగా జయలలిత ఆరోగ్యంపై ఇకనైనా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన తెలిపాడు.