పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూమెంట్స్ శరవేగంగా కదులుతున్నాయి. ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. సినిమాల విషయంలో తన వేగాన్ని పెంచుతున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం 'సర్దార్ గబ్బర్ సింగ్' చేసిన పవన్ ప్రస్తుతం డాలి దర్శకుడుగా ‘కాటమరాయుడు’ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాటమరాయుడు సినిమా షూటింగ్ ఒకపక్క జరుగుతుండగానే దసరా సందర్బంగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మాణంలో ‘జిల్లా’ ఫేమ్ నిసన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కొబ్బరికాయ కొట్టాడు.
పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో పార్టీని పెట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా పార్టీ పెట్టి ప్రజల్లోకి తిరిగి సర్వైవ్ కావాలంటే డబ్బుకూడా భారీగానే అవసరమన్న తలంపుతో పవన్ డబ్బుకోసం చకచకా సినిమాలు ఒప్పేసుకుంటున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు ఉన్న సంపాదన సినిమాలే కాబట్టి వాటి ద్వారానే పోగేసుకొని ఎన్నికల్లో పోటీకోసం సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతోనే కష్టమైనా ఇష్టంగా భావించి మరో సినిమా ఒప్పేసుకున్నట్లు తెలుస్తుంది. ఒప్పేసుకోవడానికి ఒప్పుకున్నాడు గానీ పవన్ తన 20 ఏళ్ళ సినీ జివితంలో ఒకటి పూర్తికాకుండా మరో సినిమా సెట్టుకి వెళ్ళలేదు. అలాంటిది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పూర్తి కాకుండానే నిసన్ సినిమాకు డిసెంబర్ నుండి కాల్షీట్స్ కూడా ఇచ్చాడు. అయితే కాటమరాయుడు మీద పవన్ కి అంత ఆసక్తి లేదన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అదెంతవరకు నిజమో, ఇలాగైతే కాటమరాయుడు పూర్తి చేసుకొని బయటపడుతుందా అనేది చూడాలి. ఇంకా త్రివిక్రమ్ కూడా పవన్ తో సినిమా కోసం కథ సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. త్రివక్రమ్, నిసన్ సినిమాలు రెండూ ఒకేసారి షూటింగ్ జరుపుకోనున్నాయన్న టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడంటే భవిష్యత్తులో వచ్చే రాజకీయాల ప్రభావమే కావచ్చు అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు.