గత కొంతకాలంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో బెడ్ పై ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ వుంది. అయితే జయలలిత అలా హాస్పిటల్ పాలవ్వడం తో తమిళనాడు పాలన కుంటు పడింది. ఇక అక్కడ రాజకీయంగా కూడా వేడి రాజుకుంది. జయలలిత ఆరోగ్యం మెరుగు పడుతుందని డాక్టర్స్ చెబుతున్నప్పటికీ ఆమె ఇంకా కొంత కాలం ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలని, ఇంకా రెస్ట్ చాలా అవసరమని చెబుతున్నారు. అలా అయితే జయ చాలాకాలం రాజకీయాలకు, ముఖ్యమంత్రి పీఠానికి దూరం గా ఉండాల్సిందే. మరి జయకు వారసులుగా ఎవరో ఒకరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాల్సిన టైం, అవసరం వచ్చాయి. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చెయ్యడానికి జయలలిత క్లోజ్ ఫ్రెండ్ శశికళ పావులు కదుపుతుందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం పేరు కూడా బయటికి వచ్చింది. మరేమయిందో ఏమో ఎవరూ ఆ పీఠాన్ని అధిరోహించలేదు.
ఇక ప్రతిపక్షాలు జయలలితకి ఆరోగ్యం బాగోలేక పొతే...అసలేం జరిగిందో డాక్టర్స్ బయట పెట్టాలని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక రోజుకో రకంగా అక్కడ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. జయని పరామర్శించడానికి ఢిల్లీ నుండి పెద్దలు కూడా దిగొచ్చారు. కానీ జయకేమైందో ఎవరూ నోరు విప్పడం లేదు సరికదా.... ఆమె కోలుకుని తిరిగొస్తుందని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మరోసారి జయ ఫ్రెండ్ శశికళ వార్తల్లోకొచ్చింది. జయ నుండి చాలాకాలం దూరంగా ఉంటున్న శశి ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించడానికి తహ తహలాడుతుందని.... ఆమె ఎలాగైనా తమిళనాడు పీఠాన్ని అధిరోహించాలని చూస్తుందని చాలామంది అనుకుంటున్నారు.
ఇక శశికళ ఇప్పుడు ఒక బాంబు లాంటి వార్తను పేల్చింది. అదేమిటంటే జయలలిత అనారోగ్యంగా హాస్పిటల్ లో వున్న టైంలో కొందరు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతోంది. మరి జయ పక్కన వుండే వాళ్ళే అలా చెయ్యొచ్చని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. ఇక హాస్పిటల్ నుండి జయకు సంబంధించి ఏ లెటర్ వచ్చిన కూడా దాన్ని నిశితంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ఆమె తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర రావుకి ఒక లేఖ రాసింది. మరి అసలు శశికళ ఎందుకు ఇలా భయపడుతుంది? శశికళని కాదని వేరే ఎవరినైనా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తమిళనాడులో నియమించేస్తారని ఆమె అలా అంటుందా? లేక నిజంగానే అక్కడ అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇక మరి తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ లేఖకు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది.