అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల తర్వాత వచ్చేదే విజయదశమి. దసరాతో ముగియనుండే ఈ నవ రాత్రి పండుగ సంప్రదాయంగా వస్తూ ఓ ఉత్సవంలా అందరూ జరుపుకొనే పండుగ. అసలు ఇదంతా అమ్మవారికి సంబంధించిన పండుగనే చెప్పాలి. తెలుగువారు బతుకమ్మగా, కనకదుర్గగా, కర్ణాటకలో చాముండీ దేవిగా, బెంగాల్లో దుర్గగా ఇలా పలు ప్రాంతాలల్లో పలు పేర్లతో దేవతలను గురించి ఈ దసరా పండుగ జరుపుకుంటారు. ప్రధానంగా ఇది ఆదిశక్తికి సంబంధించిన పండుగ.
ముఖ్యంగా నవరాత్రులు ఎంతో పవిత్రంగా నిష్ఠతో కూడుకొని అమ్మవారిని ఆరాధిస్తే చెడు, విశృంఖలత్వ జీవితం తొలగిపోతుంది. ఇంకా జీవితంలో అన్ని అంశాల పట్ల, అంటే మన శ్రేయస్సుకి అవసరమయ్యే వస్తువులు, విషయాల పట్ల కృతజ్ఞతకు చిహ్నంగా భావంచి జరుపుకొనే పండుగ ఇది. నవ రాత్రులలో తొమ్మిది రోజులు మూడు మూడు ప్రాథమిక లక్షణాలైన సత్వ రజో, తమో గుణాలకు అనుగుణంగా వర్గీకరించ బడినవి. మొదటి మూడు రోజులు తామసికమైనవి. వాటికి ప్రతీకలుగా తీవ్రమైన దుర్గ, కాళికా దేవతలను చెప్పుకొని వారికి పూజలు చేస్తారు. తర్వాతి మూడు రోజులు లక్ష్మికి సంబంధించినవిగా చెప్పుకొని ఆయా దేవతలకు ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ధన, వస్తు, కనక, వాహనాలకు ఆధారమైన పూజలు జరిపి చల్లగా చూడాలని మొక్కులు తీర్చుకుంటారు. ఇక చివరి మూడు రోజులు సరస్వతి దేవిని ఆరాధిస్తారు. ఆమెలోని సత్వ గుణాలను స్తుతిస్తూ ఆ దేవి ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించాలని, ప్రతి ఒక్కరికి విద్య అబ్బాలని తద్వారా జ్ఞానోదయం కావాలని ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. నవ రాత్రుల తర్వాత పదవ రోజు నాడు చివరి రోజు విజయదశమి. ఈ రోజు భక్తులంతా ఈ సత్వ, రజో, తమో గుణాలను జయించిన వారుగా చెప్పుకుంటారు.
కాగా ఈ నవరాత్రులలో దేవీ పూజలు ద్వారా త్రిగుణాలైన తామస, రజో, సత్వ గుణాలలో వేటిని ఎంత వృద్ధి చేసుకుంటున్నారనే దానిని బట్టి వారి వారి జీవితం ఆధారపడి నడుస్తుందంటారు. వారు తామసంగా వ్యవహరిస్తే వారంతా ఒక రకమైన శక్తివంతులుగా రూపొందుతారు. మీరు రజో గణాన్ని వృద్ధి చేసుకుంటే అలా వ్యవహరించే వారి వారి జీవిన విధానం ఉంటుంది. ఇంక చివరిదైన సత్వగుణాన్ని డవలప్ చేసుకుంటే వారు జ్ఞానవంతులుగా శక్తిమంతులౌతారు. వీటన్నింటినీ అధిగమించినప్పుడే మనిషికి ముక్తి చేకూరుతుందని అంటారు. అయితే నవ రాత్రుల తర్వాత దశమి రోజు చివరి రోజు విజయదశమి. వీరంతా ఈ మూడు గుణాలను జయించారని అర్ధం. ఆయా భక్తులు వీటికేటికి లొంగకుండా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళారు. వారు అన్నింటిలో విజయం సాధించారని. వారంతా ఈ త్రిగుణాలను జయించారని చెప్తారు. అదే విజయదశమి. జయం పొందిన రోజు కాబట్టి ఆనందంగా అందరూ ఉరికే ఉత్సాహంతో అమ్మవారిని ప్రత్యేక నైవేధ్యాలు వారి వారి ఆచారాన్ని బట్టి నిర్వహిస్తారు.