2005 లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వారి సోగ్గాడు చిత్రంలోని అతిధి పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యింది అర్చన గల్రాని అలియాస్ సంజన గల్రాని. ప్రభాస్, రాజశేఖర్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల చిత్రాలలో నటించినప్పటికీ సంజనకు తెలుగులో కన్నా కన్నడలోనే అవకాశాలు, అభిమానులు ఎక్కువ. అయితే తెలుగుతో పాటు మలయాళం, తమిళ్ భాషలలోనూ నటించిన అనుభవం ఉంది సంజనకు. కన్నడలో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో లో కన్నడ చిత్ర పరిశ్రమ, కన్నడ చిత్రాల గురించి తన అభిప్రాయం చెప్పమని ఒత్తిడి చేయగా కొన్ని ఘాటు నిజాలని వెల్లడించింది సంజన.
కన్నడ చిత్రాలు నాసిరకపు చిత్రాలు అని తన మనస్సులోని అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరచి వివాదాలపాలైయింది ఈ భామ. తాను పని చేసిన ఇతర భాష చిత్రాలతో పోల్చి ఈ వ్యాఖ్య చేసి ఉండొచ్చు. ఎందుకంటే కన్నడ చిత్రాలపై ఇతర భాషల్లో నటించే ఎందరో నటులకు అటువంటి భావన ఉండటం సహజం. అయితే ఈ వ్యాఖ్య కన్నడ చిత్ర నిర్మాతలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. కన్నడ నిర్మాతల సంఘం కన్నడ ఫిలింఛాంబర్ లో సంజన గల్రానిపై ఫిర్యాదు చేసారు. ఫిలిం ఛాంబర్ సంజనను వివరం కోరగా, బిగ్ బాస్ షోలో నా వ్యాఖ్యలు యధాతధంగా ప్రసారం చెయ్యలేదు. నేను సందర్భానుచితంగా మాట్లాడిన మాటల్లో వారికి అనుగుణంగా మాటలు పేర్చి ఆ వీడియో తయారు చేసారు. కానీ నా చర్యల వల్ల ఎవరి మనోభావాలైనా గాయపడినట్లు అయితే నేను వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అని సంజాయిషీ ఇచ్చుకుంది సంజన.
గత కొంత కాలంగా సంజన సోదరి నిక్కీ గల్రాని కూడా దక్షిణ భాషలలో కథానాయికగా నటిస్తుంది. తెలుగులో సునీల్ సరసన కృష్ణాష్టమి చిత్రంలో కనిపించింది నిక్కీ గల్రాని.