గతంలో ఓ హీరోతో ఓ దర్శకుడు సినిమా చేస్తున్నాడు అని ఖరారైతే ఇక ఆ కాంబినేషన్ ఖచ్చితంగా సెట్ అయినట్లే భావించేవారు. కానీ నేడు మాత్రం ఓ కాంబినేషన్ వస్తోందని అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత కూడా సినిమా పట్టాలెక్కే వరకు సజావుగా అదే కాంబినేషన్ పట్టాలెక్కుతుందో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడుతూ కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుండి వరుణ్‌తేజ్ వరకు ఇదే వరస. మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం చేయాలని డిసైడ్ అయిన తర్వాత పూరీ దర్శకత్వంలో మెగాస్టార్ నటించడం ఖాయమైంది. దీనిని నిర్మాత రామ్‌చరణ్ సైతం అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రం ఖాయం అనుకున్నంతలోనే సెకండ్ హాఫ్ కథ నచ్చలేదని చెప్పి, ఆ స్దానంలో వినాయక్‌తో తమిళ 'కత్తి'కి రీమేక్‌గా 'ఖైదీ నెం 150' చిత్రం రూపొందుతోంది. ఇక బాలకృష్ణ సైతం మొదట తన వందో చిత్రానికి సింగీతంతో 'ఆదిత్య 999' చేస్తానన్నాడు. ఆ తర్వాత కృష్ణవంశీతో 'రైతు', ఆ తర్వాత అనిల్‌రావిపూడి వంటి కాంబినేషన్లు ప్రస్తావనకు వచ్చాయి. అనూహ్యంగా బాలయ్య తన వందో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' అనే చారిత్రక చిత్రం చేస్తున్నాడు. ఇక పవన్ విషయానికి వస్తే సంపత్‌నందితో 'సర్దార్ గబ్బర్‌సింగ్' అనౌన్స్ చేసి చివరకు బాబితో ఆ చిత్రం చేశాడు. ఇక తాజాగా చేస్తున్న 'కాటమరాయుడు' కు కూడా ఎస్.జె.సూర్యతో కొంత పని కానిచ్చాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రం డాలీ చేతిలో పెట్టాడు. ఇక రామ్‌చరణ్ విషయానికి వస్తే 'ఆరెంజ్' తర్వాత ధరణి డైరెక్షన్‌లో 'మెరుపు' చిత్రం ఆరంభించి ఆ తర్వాత ఆ చిత్రం రద్దు చేశారు. ఇక కొరటాల శివతో కూడా రామ్‌చరణ్ పూజా కార్యక్రమాల దగ్గర వరకు వచ్చి తర్వాత నో అన్నాడు. ఇక వరుణ్‌తేజ్ అయితే క్రిష్‌తో 'రాయబారి' అని, ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ చిత్రం అనౌన్స్ చేసి చివరకు శ్రీనువైట్లతో 'మిస్టర్', శేఖర్ కమ్ములతో 'ఫిదా' చిత్రాలు చేస్తున్నాడు. మొత్తానికి కాంబినేషన్స్ ఇలా మారిపోతుంటే ఆశ్చర్యపోవడం అందరివంతు అవుతోంది.