జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, కార్యకర్తలు కలిసి సోషల్ మీడియాలో ఇక అంతా చూపెడతామని హడావుడి చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పార్టీ తరఫున ఒక టీజర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌లో ఎలా ఉందంటే పవన్ ప్రసంగించేలా ఉండే ఓ పేద్ద వేదిక, మధ్యలో జనాల ఫొటోలు పెట్టారు. సోషల్ మీడియాలోకి చొచ్చుకుపోయిన ఎన్నిరకాలుగా ప్రచారాన్ని ఆర్భాటంగా ప్రారంభించాలో అన్నీ చేపట్టారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్ల ద్వారా ఇకపై జనసేన కార్యక్రమాలను ప్రజలకు చేరేలే చూపాలని అదిరిపోయే హడావుడి జరిపారు. ఇవన్నీ బాగానే ఉన్నాయిగానీ పార్టీ నిర్మాణ పరంగా జరగాల్సిన బేస్ లెవల్ కార్యక్రమాలు అస్సలు మొదలు కాలేదని ఇతర పార్టీల వాళ్ళు చూస్తూ ఉన్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయుల్లో పార్టీ నిర్మించుకొనేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదు సరికదా, ఇక్కడ కూడా జనసేన మరో సినిమాలా వ్యవహరిస్తుంది. ఓ పక్క పవన్ సినిమాలతోపాటే, రాజకీయాలు కూడా చేస్తానంటూ ఆ రకమైన ధోరణిలో ఉంటే కేవలం అభిమానులు మాత్రమే ఈ హడావుడి అంతా చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ప్రత్యేక హోదాపై తాను ఇచ్చిన హామీలు, ప్రకటించిన విషయాలను ఆచరించేలా అడుగులు పడటం లేదు. మూడు అంచెల్లో ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామని చెప్పి అభిమానులను ఉసిగొల్పి, తిరుపతి, కాకినాడ రెండు సభలకు మాత్రమే సరిపెట్టేశారని తెగ నవ్వుకుంటున్నారు జనాలు.
పవన్ జరుపుతామంటున్న దశలవారీగా ఉద్యమాలు ఎటై పోయాయోనని తెగ చెవులు కొరుక్కుంటున్నారు ప్రజలు. కనీసం పార్టీ పటిష్టత కోసం సోషల్ మీడియా కాదు... జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే కార్యకర్తలు ఉన్నారా? వీరికి అంటూ తెగ చర్చించుకుంటున్నారు. అప్పుడెప్పుడో ఎవరో అనగా ఓ మాట విన్నాను. అదేంటంటే రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాలని, కథా నాయకుడు ప్రజల్లో కనిపించకూడదని. మరి పవన్ ఇలా ప్రజల్లో కాకుండా సినిమాల్లోనే కనిపిస్తామంటే జనసేన కూడా మరో ప్రజారాజ్యమే అవుతుందేమో. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ సరిగ్గా త్వరలో ఓ క్లారిటీకి వస్తే బాగుంటుంది.