ఒకరు జగన్, మరొకరు లోకేష్, వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొడుకులు. రాబోవు ఎన్నికల్లో వీరిద్దరి మధ్యే తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇద్దరు మహావ్యక్తుల కొడుకులు ఆ ఇద్దరు. ఒకరు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైతే, మరొకడు ప్రస్తుత ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు. చంద్రబాబు ఇస్తున్న సంకేతాలను బట్టి, లోకేష్ ను రాజకీయాల్లోకి నెడతున్న విధానాన్ని బట్టి చూస్తే రాబోవు ఎన్నికల్లో లోకేష్ కీలకమైన వ్యక్తిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే లోకేష్ లో ఉన్నదేంటి జగన్ లో లేనిదేంటి. జగన్ కి ఉన్నదేంటి లోకేష్ లో లేనిదేంటి అనే విషయాన్ని గురించి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. ఈ ప్రస్తావన కూడా ఇప్పుడెందుకు వచ్చిందంటే విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల్లో లోకేష్ మాట్లాడే విధానం, కార్యకర్తలకు మెల్లిగా సూచనలిచ్చే తీరును గమనిస్తే లోకేష్ చాలా మెతక గురూ.. అన్న ఆలోచనలు అక్కడి వారికి కలిగాయంట. కానీ అధికారంలో ఉన్నవారు కదా ఎలా ఉన్నా మా యువపులి అంటూ మెచ్చేసుకుంటారనుకో. కానీ లోకేష్ సమావేశాల తర్వాత మీడియాతో మాట్లాడుతూ మెత్తని పులిలా జగన్ కు చురకలు పుట్టించేలా వ్యక్తీకరించిన పదజాలం ఉంది చూడండి దాంతో కార్యకర్తలంతా పొంగిపోయారు. తనకు జగన్ కు మధ్య చాలా పోలికలు ఉన్నాయని, తాను అధికారం కోసం బాబాయిలను రాజీనామా చేయించనని, అధికార దాహంతో తండ్రికి తలవంపులు తెచ్చిపెట్టేలా వ్యవహరించనని మెత్తగా జగన్ ను చురుక్కుమనిపించారు. దీంతో తెదేపా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. చూడబోతే జగన్ కు ఉన్న గడుసుతనం, రాష్ గా ఉండే మాటతీరు, సమయస్ఫూర్తి, లోకేష్ లో లేకపోయినా, అవన్నీ మెత్తని మాటలతో కొట్టేసేస్తున్నాడులే.