ఎంతైనా తెలుగువాళ్ళకంటే తమిళులకే ఐక్యత, అనుబంధాలు, జాతి అనురాగాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకుండే తన మన భావం ముందు మనవాళ్ళు దిగదుడుపే. మొన్నామధ్య బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రియల్ లో ఆ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు కూడాను. దక్షిణ భారతదేశంలో అంతటి మహత్తరమైన అవకాశాన్ని దక్కించుకున్న మొట్ట మొదటి వ్యక్తి ప్రభాస్ తెలుగు వాడు అయినందుకు తెలుగువారంతా మనసులో ఆనందపడ్డారనే అనుకోవాలి. ఎందుకంటే అటువంటి గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న బాహుబలి ప్రభాస్ ను అభినందిస్తూ ఎవరూ కూడానూ కనీసం బహిరంగంగా అభినందనలు తెలుపక పోవడం శోచనీయం. కనీసం సినీపరిశ్రమకు చెందిన పెద్దలు కూడా ఆ రకమైన అభినందనలు తెలపకపోవడం అనేది దేనికి దారితీస్తుందో ఆ విషయం పరిశ్రమకే తెలియాలి. ఇంతటి అరుదైన గౌరవాన్ని పొందినందుకు ఏ ఒక్కరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రభాస్ ప్రశంసించలేకపోవడం, అటువంటి సాహసం కూడా చేయలేకపోవడం చూస్తే జాలేస్తుంటుంది. అంటే దీన్నిబట్టి తెలుగువాళ్ళ మనస్తత్వాలు ఎలాంటివో ఏపాటివో అర్ధమౌతుంది. అస్సలు ఎవరన్నా అలా ప్రకటిద్దామన్నా ఎవరేమనుకుంటారోనన్న భయమో దీనికి కారణం మరొకటో తెలియదు గానీ అస్సలు ఏ రకంగానూ జరపకపోవడం చాలా బాధాకరం. ఈ దృష్టాంతం సాటి వాడి దృష్టిలో తెలుగువారికి ఎదురయ్యే చులకనభావమే అవుతుంది. అస్సలు దీనంతటికీ కారణం తమకు రాలేదన్న బాధనా? లేక ఎదుటి వారికి వచ్చిందన్న ఆక్రోశమో? తెలియని ఓ అంతుపట్టని సందర్భంలో తెలుగు పరిశ్రమ కొట్టుమిట్టాడుతుంది.
ఇకపోతే ఎందరో మహానుభావులను విడిచిపెట్టి ప్రభాస్ కు మాత్రమే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఒకపక్క తమిళ మీడియా విచ్చలవిడిగా నానాయాగీ చేస్తుంది. బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ స్థాయి పెరిగిందన్నది నూటికి నూరు పాల్లు వాస్తవమే. అందులో సందేహం లేదు. ఇప్పుడు ఇక్కడ తమిళవాళ్ళ బాధ ఏంటంటే కేవలం సినిమాలకు పరిమితమై మాత్రమే చూసినా దక్షణాదిన ముందు ఎంజీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత కమల్ హాసన్ విగ్రహం ఉండాలి అంటున్నారు నిర్మాత ధనంజయన్ గోవింద్. ఇంకా ఎంజీఆర్, శివాజీ గణేసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ ఇంకా దక్షణాదికి చెందిన గొప్ప నటుల విగ్రహాలు పెట్టేందుకే ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలంటూ తమిళులు ఎంతటి ప్రాంతీయాభిమానం చూయించుకుంటున్నారో చూడండి. ఇంకా ఖుష్బు మాట్లాడుతూ... మైనపు విగ్రహాలకు ఏర్పాటుకు ప్రభాస్ గేట్ ఓపన్ చేశాడు కాబట్టి కమలహాసన్, రజినీకాంత్ వంటి గొప్ప నటుల విగ్రహాలు కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పింది. చూడండి తమిళులు తెలుగులో గొప్ప నటుడైన ఎన్టీరామారావు విషయం ఏమైనా మాట్లాడలేదు. దానికి కారణం ఉంది. వాళ్ళు వారి వరకే చూసుకున్నారు. కానీ మనవాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, వచ్చిన వారిని అభినందించకపోగా తనకు రాకుండా అతడికెలా వచ్చిందబ్బా అంటూ ఉడుకుపోత్తనంతో ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు.