పెద్ద హీరోలకు ఓపనింగ్స్ అదుర్స్ అన్నట్లుగా ఉంటాయి. ఆ తర్వాత సినిమా మెప్పించే స్థాయిని బట్టి ఆ సినిమా బిజినెస్, జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఎప్పుడూ కూడా హీరో రేంజ్ ను బట్టి సినిమా బిజినెస్ జరుగుతుంది. అలా అధిక ఆశపడి కొనుక్కొన్ను డిస్టిబ్యూటర్లు చాలా మార్లు సినిమా బోర్లాపడటంతో తీవ్ర నష్టాలకు గురైన సందర్భాలు చాలా చవిచూశాం. రజనీ కాంత్ వంటి బడా హీరోల సినిమాలప్పుడే ఎక్కువ మొత్తంలో ప్రదర్శన హక్కులను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడ్డ సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా అలాంటి నష్టాలనే చవిచూశారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా బిజినెస్ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వినిపిస్తుంది. కాటమరాయుడు సినిమాను సర్దార్ గబ్బర్ సింగ్ ను కొన్న డిస్ట్రిబ్యూటర్లకే అతి తక్కువ మొత్తానికి ప్రదర్శన హక్కులను ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కాటమరాయుడు చిత్రాన్ని భారీ స్థాయిలో బిజినెస్ కు పెట్టకుండా పంపిణీదారులు, కొనుగోలు దారులు నష్టపోని రీతిలో తగ్గించి అమ్మమని చిత్ర నిర్మాత అయిన శరత్ మరార్ కు స్వయంగా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ విషయం సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయ పరమైన అడుగులకు లింక్ చేస్తూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలు ఈ సినిమాకే పవన్ కళ్యాణ్ ఎందుకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను తక్కువ చేసినట్టు అంటూ సినీజనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇంకా పవన్ మెల్లిగా రాజకీయాల్లోకి జారుకోనుండటంతో ఇలాంటి మంచి ఆలోచనలతో ప్రజలకు మరింత చేరువై వారి మనస్సును దోచుకోవాలని పవన్ ఆలోచిస్తున్నాడా? అంటూ కూడా వారి చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి సర్దార్ లెక్కలను పవన్ కాటమరాయుడు రూపంలో తేల్చేయనున్నాడన్నమాట.