చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా, చాలా స్పష్టంగా చెప్పే మనస్తత్వం కలిగిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి. ఏ విషయంలోనైనా పోసాని కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతుంటాడు. వందకు పైగా కథలు రాసిన ఈ సీనియర్ రైటర్ నుండి డైరెక్టర్ గా మారి.. ఇప్పుడు నటుడిగా మంచి గుర్తింపు పొందుతున్నాడు. అయితే బాలీవుడ్ నటుడైన సల్మాన్ ఖాన్ మీద పోసాని తీవ్రంగా విరుచుకు పడ్డాడు. ఓ ఇంటర్వులో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ ... బాలీవుడ్ నటుడైన సల్మాన్ ఖాన్ ను మించిన తీవ్రవాది మన దేశంలోనే లేడూ అంటూ చెలరేగిపోయాడు.
భారత్ – పాకిస్తాన్ కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న పాకిస్థాన్ నటులను దేశం విడిచి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హుకుం జారీ చేసింది. కాగా ఇటువంటి ఈ సమయంలో వారు నటిస్తున్న సినిమాల షూటింగులు కూడా జరగకుండా అడ్డుకుంటామని కూడా మహారాష్ట్ర నవ నిర్మాణసేన హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పలువురు పలు రకాలుగా భిన్న కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన సల్మాన్ ఖాన్... యురీ దాడి చేసింది తీవ్రవాదులే కానీ కళాకారులు కాదు, పాకిస్తాన్ నటులేం ఉగ్రవాదులు కాదు, భారత ప్రభుత్వం అనుమతితో నే వారు ఇక్కడికి వచ్చారు అంటూ పాకిస్తాన్ నటులకు వత్తాసు పలికి వారిని వెనకేసుకొచ్చాడు. కాగా ఈ విషయంపైన పోసాని కృష్ణమురళి స్పందిస్తూ... 'అసలు సల్మాన్ ఖాన్ నిజంగా ఉత్తమ పురుషుడైనట్లయితే, తన కారు యాక్సిడెంట్ కు గురైనప్పుడు ఎందుకు పారిపోయాడని ప్రశ్నించాడు'. ఇలా సల్మాన్ ఖాన్ స్పందనపై చాలా మంది భిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.