సమాజంలో సంచలనం రేపిన వ్యక్తులు, ఘటనలు ఆధారం చేసుకొని సినిమాలను తీయడమంటే రాంగోపాల్ వర్మకు కసి అనే చెప్పాలి. అంటే అటువంటి సినిమాలను చాలా కసిగా, అంతే ఇష్టంగా, మరెంతో వ్యసనంగా భావించి తెరకెక్కిస్తుంటారు. అందుకే ఆయన దర్శకత్వంలో రక్తచరిత్ర, కిల్లింగ్ వీరప్పన్ వంటి సినిమాలు వచ్చాయి. యధార్ధ గాధలను ఆధారం చేసుకొని సినిమాలు తెరకెక్కించడంలో వర్మదే పైచేయి. తాజాగా విడుదలైన వంగవీటి ట్రైలర్ చూస్తే అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాస్తవంగా జరిగిన అంశాలను ఆధారంగా చేసుకొని సినిమాగా ఆవిష్కరించాలంటే కొంత గట్స్ కావాలి. ఆ విషయంలో వర్మకు గట్స్ ఎక్కువ. ఎంతో గడుసుతనంతో, సాహసంతో వంగవీటి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆయన తాజాగా విడుదల చేసిన వంగవీటి ట్రైలర్ సంచలనాలను సృష్టిస్తుంది. వంగవీటి ‘కాపు కాసే శక్తి’ అనే ట్యాగ్ లైన్ తో ఆంధ్రప్రదేశ్ లో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య ఉన్న వైరాన్ని విభిన్నంగా, ఎంతో వైవిధ్యభరితంగా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ట్రైలర్ ను బట్టి చూస్తే సినిమాకు కథ, కథనాలు, పాత్రలు పోషించిన నటులు ఆయా పాత్రలకు జీవం పోసినట్టుగా ఆయా పాత్రలను తీసుకెళ్ళిన లెవల్స్ ను బట్టి అట్టే తెలిసిపోతుంది.
చిత్రం పేరే వంగవీటి అని పెట్టిన వర్మ, ఆ పేరు తలిస్తేనే గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఆ వాతావరణం జ్ఞాపకం వస్తుంది. వంగవీటి అనగానే కథ ఎవరికి సంబంధించింది, ఆ కథ ఏ ఏ సామాజిక వర్గాలను ఆధారంగా చేసుకొని నడుస్తుంది అనే విషయం స్పష్టమౌతుంది. వర్మ ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడో అనే విషయం కూడా ట్రైలర్ ద్వారా వెల్లడౌతుంది. పాత పగల్ని, ప్రతీకారాలను జ్ఞప్తికి తెచ్చేలా ఉంది వంగవీటి ట్రైలర్. వాడిన పదజాలాన్ని బట్టి చూస్తే అప్పట్లో జరిగిన వాస్తవ చిత్రణను తలచుకొని ఉలిక్కి పడేలా మాటలు ఉన్నాయి. అప్పట్లో విజయవాడ పరిసర ప్రాంతాలలో జరిగిన ఘోరాలను, వాతావరణాన్ని చూపేలా పాత్రలను అదే స్థాయిలో చూపించిన విధానం అద్భుతంగా ఉంది. ‘కాపు’కాసే శక్తి అనే ట్యాగ్‌లైన్‌తో పాటు ‘కమ్మ’ని పౌరుష సూక్తి అని చెప్పి అప్పట్లో ఆయా సామాజిక వర్గాల మధ్య వైరం ఏ స్థాయిలో ఉండేదో చెప్పకనే చెప్పాడు. సినిమా అలా ఉంటుందని హింట్ ఇచ్చాడు వర్మ. చూడబోతే వర్మ వంగవీటి ట్రైలర్ సంచలనాల దిశగా పయనించడం మాత్రం నిజం. అందులో సందేహం లేదు. ఇకపోతే వర్మ టేకింగ్, పాత్రలను తీసుకెళ్ళే స్థాయి, నడిపించే విధానం గురించి ఇంక చెప్పక్కరలేదు. అద్భుతం.