రామ్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హైపర్'. సెప్టెంబర్ 30న సినిమా విడుదలైంది. సినిమాలో భానుమతి అనే డబుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో మెప్పించిన హీరోయిన్ రాశిఖన్నా సినిమా గురించిన సంగతులను తెలియజేసింది. ఈ సందర్భంగా….
రాశిఖన్నా మాట్లాడుతూ - నాకు హైదరాబాద్ సిటీ అంటే చాలా ఇష్టం. ఇక్కడకు ఎప్పుడు రావాలన్నా ఇష్టపడతాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ప్రభావతి, బెల్లం శ్రీదేవి, ఇప్పుడు హైపర్‌లో భానుమతి క్యారెక్టర్‌కు చాలా మంచి పేరు వచ్చింది. భానుమతి క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయని తెలియగానే నచ్చి నటించడానికి ఒప్పుకున్నాను. అందులో ఒకటి కళ్ళజోడుతో అమాయకంగా ఉండే షేడ్ అయితే మరొకటి మోడ్రన్‌గా ఉండే షేడ్. అమాయకంగా ఉండే అమ్మాయి రోల్ కోసం లుక్ టెస్ట్ కూడా చేశారు. ఈ రెండు షేడ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి రోల్ చేయడానికి నేను డైరెక్టర్‌ని ఫాలో అయిపోయానంతే. కామెడి టచ్ నాలో ఎక్కువగా ఉంటుంది. సెట్‌లో ఉన్నా కూడా అందరినీ నవ్విస్తుంటాను. ఈ సినిమాలో వెయిట్ కూడా తగ్గాను. అలా తగ్గడానికి తాత్కాలిక అనారోగ్య సమస్యలు కూడా ఒక కారణం అనొచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే స్టైల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. అలాగే పర్టికులర్‌గా బాలీవుడ్‌లోకి ఎంటర్ కావాలని ప్రయత్నాలు చేయడం లేదు. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. ఏదో సక్సెస్ సాధించేయాలనో, ఎక్కువ సినిమాలు చేసేయాలనో టెన్షన్ పడను. తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడానికి నేను సిద్ధమే. అలాగే పీరియాడిక్ ఫిలింలో కూడా నటించాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంది కానీ అంత సమయం ఉండటం లేదు. ఇక ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్‌లో నటిస్తున్నారు. నా విషయానికి వస్తే ఐటెం సాంగ్స్ చేయడానికి నేను అంత కంఫర్ట్‌గా ఫీల్‌కాను. కానీ చేయనని కాదు, ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది. ఇక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి చూస్తే...నేను ఖాళీ సమయాల్లో క్రికెట్ ఆడతాను, బుక్స్ చదువుతుంటాను. సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తాను. అయితే వాటి గురించిన వివరాలు ఇప్పుడు చెప్పదలుచుకోవడం లేదు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో రవితేజగారితో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.. అన్నారు.