సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. అదేంటో ఆయన ఈ మధ్యే కాదు గత చాలా కాలం నుండి ట్విట్టర్ వేదికగా మనస్సుకు తోచిన అంశాలను అలా వెంటనే అందరితో పంచుకోవడం సరదాగా భావించి అలా ఆనందపడిపోతున్నాడు. అందులో అందరికీ జీర్ణం కాని అంశం ఏంటంటే ఒక్కోసారి పొగిడిన వ్యక్తిని కూడా మరో సందర్భంలో తెగడటమే. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తిని రేపే కామెంట్లతో ట్విట్టర్ వేదికగా చెలరేగి పోయాడు. ‘నేను ఖచ్చితంగా చెప్పగలను పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరినీ కాపు కాసే శక్తిమంతుడు అవుతాడు, నాకు ఆయన మీద అంత నమ్మకం ఉంది’ అంటూ కమ్మగా ధీమాని వ్యక్తం చేశాడు రాం గోపాల్ వర్మ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కమ్మగా కాపు కాసే శక్తిమంతుడు. అంతే కాకుండా పవన్ అత్యున్నతమైన నాయకుడు అంటూ వర్మ పవన్ పై కామెంట్ చేశాడు. ఈ ఒక్క కామెంట్ తో ప్రస్తుతం ఆంధ్రా ప్రాంతంలోని రాజకీయ ముఖచిత్రాన్ని అద్దంలో చూపించాడు వర్మ. ఎవరు ఎలా అయినా అర్థం చేసుకోండి అన్నట్లు ఆయన ఈ కామెంట్ ను పెట్టినట్లుగా వెల్లడౌతుంది. ఆంధ్రాలో కమ్మ సామాజిక వర్గం అధికారంలో ఉండగా, కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లపై ఏకంగా ఉద్యమాన్నే నడుపుతున్న విషయం తెలిసిందే. మొన్న ఆటలో అరటిపండులా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వత్తాసుగా ఉంటూనే ప్రభుత్వంపై విరుచుకు పడినట్లు నటిస్తూ హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రానికి ప్రశాంత వాతావరణాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వర్మ మెత్తని ఘాటు కామెంట్లు హాట్ ను రేపుతున్నాయి. ఇక్కడ వర్మ ఉద్దేశం పవన్ ను కమ్మలలో దూరి కాపులకు కావాల్సిన ఆ రిజర్వేషన్లను కూడా సాధించిపెట్టే గడుసున్న నాయకుడనా. అంతే కాకుండా విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వంగవీటి సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ పాటలో కాపు, కమ్మ కులాల గురించిన ప్రస్తావన ఉంది. తాజాగా వర్మ పవన్ గురించి పెట్టిన కామెంట్స్ లో కమ్మ, కాపు పేర్లు ప్రస్తావనకు రావడం చర్చకు దారితీసే అంశంలా అనిపిస్తుంది. కాగా వర్మ ఈ విషయంపై వెంటనే స్పష్టత నిచ్చాడు. కమ్మగా అంటే స్వీట్ అని అర్థమని, కొందరు భావిస్తున్నట్టు కాపు, కమ్మ కులాలకు సంబంధించి కాదని ట్వీట్ చేసి మరీ వివరించాడు. దీన్నే అంటారు అనుకున్న విషయాన్ని మొదట ప్రకటించేసుకొని, తన భావం తాలూకూ దూల తీర్చుకున్న తర్వాత... నా భావన అది కాదంటూ చెప్పడం రచయితలకు పరిపాటిగా మారింది. ఇంక దర్శకుల సంగతి చెప్పక్కరలేదనుకోండి. ఎందుకంటే వాళ్ళ దృష్టి మామూలుగా ఉండదుగా...