బాహుబాలి2 కి సంబంధించి ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ గురించి అక్టోబర్ 5వ తేదీన ఓ అద్భుతం జరగపోతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. అదేంటో తెలియాలంటే అక్టోబర్ 5 వరకు సర్ ప్రైజ్ గా వెయిట్ చేయాల్సిందేనని తెలిపాడు. అయితే అంతకు ముందే ఆ సర్ ప్రైజ్ కు చెందిన రహస్యం వెల్లడైంది. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రముఖ టాలీవుడ్ హీరో ప్రభాస్ మైనపు బొమ్మను అమరేంద్ర బాహుబలి రూపంలో ఏర్పాటు చేయబోతున్నారు. బ్యాంకాంక్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు ఉండే మ్యూజియంలో తొలిసారిగా తెలుగుకు సంబంధించిన ప్రముఖ హీారోకి చోటు దక్కటంపై సర్వత్రా సంతోషం వ్యక్తమౌతుంది. 2016 ఏప్రియల్ లో భారత ప్రధాని నరేంద్ర మోడి ఆ గౌరవాన్ని దక్కించుకోగా ప్రస్తుతం ప్రభాస్ కి ఆ అద్భుత అవకాశం దక్కింది. కాగా ఇప్పటి వరకు ఆ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రముఖ భారతీయులలో మూడవవాడిగా ప్రబాస్ కి ఆ ఘనత దక్కింది. మొదట మహత్మాగాంధీకి, తర్వాత నరేంద్ర మోడి, మూడవ వ్యక్తిగా ప్రభాస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బాహుబలి విడుదల సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ప్రభాస్ గురించి గూగుల్ సర్చ్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగానూ, ఇంకా అభిమానుల అభ్యర్ధన వల్లనూ.. ఈ ఎంపిక చేసినట్లు టుస్సాడ్స్ మ్యూజియం తెలిపింది.
ఈ విషయంపై ప్రభాస్ స్పందిస్తూ ఈ అద్భుత అవకాశం తనకు అభిమానుల ద్వారానే దక్కిందని, అందుకు తనకు చాలా ఆనందంగా ఉందని వివరించాడు. అద్భుతమైన చిత్రరాజంగా తీర్చిన తన గురువు రాజమౌళికి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతటి అద్భుత అవకాశాన్ని ఇచ్చిన అభిమానులు చూపించే ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేనని వెల్లడించాడు.