ఢిల్లీ తెలంగాణ భవన్‌లో, తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ చరిత్రను తెలిపేలా ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి స్మృతి ఇరాని, బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. తర్వాత వీరంతా తెలంగాణ తల్లికి మొదట పూలమాలలు సమర్పించి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మృతి ఇరాని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివని ఆమె అన్నది. వేడుకలో భాగంగా తెలంగాణ సంప్రదాయం ప్రకారం గౌరమ్మను పూజించి, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను ఎత్తుకున్నది కేంద్రమంత్రి స్మృతి ఇరాని. తర్వాత ఆమె స్పందిస్తూ.. తాను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాననీ, ఉద్యమం జరిగిన తీరుతెన్నుల్ని ఆమె గుర్తు చేసుకుంది. అలాగే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో బతుకమ్మ వేడుకను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా వెల్లడించాడు.
తెలంగాణ రాష్ట్రం పండుగలకు, సంప్రదాయాలకు నిలయమని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నాడు. పంట చేతికందాక ప్రజలంతా ఆనందంగా జరుపుకొనే ప్రకృతి పండుగ బతుకమ్మ అని ఆయన వివరించాడు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఈ బతుకమ్మను జరుపుకుంటారని ఆయన తెలిపాడు.