ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, ఛాలెంజ్ గా తీసుకొని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా విభజన సమయంలో కేంద్రప్రభుత్వం చాలా బలంగా బల్లగుద్ది మరీ పోలవరం పూర్తి చేసి తీరుతామని మాటిచ్చి ఆ తర్వాతే తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించింది. అలాంటి ప్రధానమైన ఆంధ్రాకు ఆయువు పట్టైన పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ మధ్యనే ఆంధ్రాలో కడుతున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ప్రత్యేక హోదానిచ్చి నాబార్డు ద్వారా తామే మొత్తాన్ని నెత్తినేసుకొని పూర్తిచేస్తామని అధికారికంగా ప్రకటించింది కూడాను. దాన్ని ఆదరాగా తీసుకొని ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం రాబోవు సాధారణ ఎన్నికలకు ముందే పూర్తి చేస్తే దాంతో ఎన్నికలకు వెళ్తే అన్నీ కలిసొచ్చే అంశంగా ఉపయోగించుకోవచ్చని ఆలోచనలో పడి సంబరపడింది. కానీ ఇప్పుడు అంత తేలిగ్గా పోలవరం అనుకున్న ప్రకారం అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కనిపించడం లేదు.
విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అది విచారణకు వచ్చింది. పిటిషనర్ వాదిస్తూ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ బ్యాక్ వాటర్ తో తమ రాష్ట్ర గ్రామాలు మునిగిపోతాయని వివరించాడు. అలాగే ఈ విషయంలో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల మద్దతు కూడా తమకు ఉందని వెల్లడించింది. ఇంకా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బచావత్ అవార్డు ప్రకారం నీటిలో తమకు కూడా వాటా ఉందని వివరిస్తుంది. ఇదిలా ఉండగా వీరి వాదనలను విన్న సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు నోటీసులు పంపింది. నోటీసులలో పేర్కొన్న విషయాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని సుప్రీంకోర్టు కోరింది. ఇది ఇలాగే కొనసాగితే పోలవరం అనుకున్న సమయానికి పూర్తి అవ్వకపోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెంబేలెత్తుతుంది.