అధికారం చేతిలో ఉంటే నాయకులు ఏదైనా చేయగలరు. పక్కనే తిరుగుతూ ఉన్నవాడైనా, తన స్నేహితుడైనా, స్వయానా బంధువైనా తన మాట వినని పక్షంలో మాట వినేలా అంతర్లీనంగా కొన్ని వ్యవహారాలు జరుపుతుంటారు. ప్రభుత్వాలకు అది బాగా తెలుగు. ఎక్కడ టచ్ చేస్తే అతడు మన మాట వింటాడు అనుకొని ఆయా వ్యక్తులను ఆడుకోవడం నాయకులకు సరదా. ఆ సరదాలో భాగంగా అప్పుడప్పుడు కొంతమంది బలి అవుతుంటారు. తాజాగా తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి ఆస్తులపై ఐటి అధికారులు సోదాలు జరిపారు. ఆయన నివాసం, ఆఫీసులలో ఏకబిగిన ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన దాడిలో మోదుగుల బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్స్ విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
బెంగుళూరులోని ఆ వెంచర్స్ కు సంబంధించిన కీలక పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలను నిశితంగా పరిశీలించిన తరువాత మోదుగులకు ఐటి అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మోదుగులకు సంబంధించిన ఆస్తులపై ఐటి దాడులు నిర్వహించేటప్పుడు ఆయన అందుబాటులో లేరని తెలుస్తుంది. కాగా ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఐటీ అధికారులకు అందించిన సమాచారం మేరకు ఈ దాడులు జరుగుతున్నాయా లేకా ఇందులో రాజకీయ కోణం వంటివి ఏమన్నా ఉన్నాయా అనే విషయంపై గుసగుసలు మొదలయ్యాయి. ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఐటి దాడులు జరగడం అంటే ఏదో ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశంలాగానే ఉంది.