తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోలుకుంటున్నట్లుగానే తెలుస్తుంది. గత వారం రోజుల నుండి జయలలిత తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం పట్ల కార్యకర్తలు, అభిమానులు, నేతలు చాలా కలవరపాటుకు గురవుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం జయలలితను మెరుగైన వైద్య పరీక్షల కోసం సింగపూర్ తరలిస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆ వార్తలను కొట్టివేస్తూ జయలలిత మెల్లిమెల్లిగా కోలుకుంటుందన్న విషయంపై అపోలో వైద్యులు స్పష్టతనిచ్చారు. ఇదిలా ఉంటే అమ్మ ఆరోగ్యం విషయంపై సోషల్ మీడియాలో అభిమానులను కలవర పరిచే కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఈ వార్తలకు కార్యకర్తలు, అభిమానులు, నేతలంతా కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. జయలలితకు ఇప్పుడున్న ఇలాంటి సందర్బంలో ఎవరైనా గానీ ప్రత్యక్షంగా చూసిన విషయాన్నే నమ్ముతారు.
ప్రస్తుతం జయలలిత కోలుకుంటున్నట్లుగానే తెలుస్తుంది. డీహైడ్రేషన్ తో బాధపడుతున్న ఆమె అపోలో ఆసుపత్రి నుండే పాలనకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం జయలలిత ఆసుపత్రి నుండే కొద్దిరోజుల్లోనే జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించిన అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు అంటున్నారు. ఇంకా మొన్న రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన కుటుంబానికి పరిహారాన్ని కూడా ఆసుపత్రి నుండే సంబంధిత ఫైల్ పై సంతకాలు చేసి పంపినట్లుగా అర్ధమౌతుంది. కాగా ముందస్తు జాగ్రత్తతోనే ఆమెను ఆసుపత్రిలోనే ఉంచడం జరిగిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా జయలలిత కోలుకుందన్న తలంపుతో తమిళనాడుకు చెందిన జయలలిత అభిమానులు, నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నట్లుగా అమ్మయ్య అంటున్నారు.